* తమిళనాడు స్నాచర్ల అరెస్ట్..
* వరంగల్లో భారీ రికవరీ
* 95 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం..
* వరంగల్ సీపీ కీలక వివరాలు
* జల్సాల కోసం దారి దోపిడీలు
* ఇద్దరు నిందితులను కటకటాల్లోకి నెట్టిన పోలీసులు
ఆకేరు న్యూస్, వరంగల్:వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒంటరి మహిళలే లక్ష్యంగా చెయిన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సీసీఎస్ మరియు హన్మకొండ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్లో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి సుమారు 15 లక్షల 20 వేల రూపాయల విలువైన 95 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, ఒక ద్విచక్ర వాహనం మరియు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* ముఠా వివరాలు:
అరెస్ట్ అయిన వారిలో తమిళనాడులోని మధురైకి చెందిన కళ్యాణ సుందరం (30), సెల్వరాజ్ (28) ఉన్నారు. వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పూనుకున్నారు. నిందితుడు కళ్యాణ సుందరం గతంలో గంజాయి విక్రయాలు, వాహనాల చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. జైలులో పరిచయమైన సెల్వరాజ్తో కలిసి ఈ దొంగతనాల ప్లాన్ వేశాడు.
* చోరీల పర్వం సాగిందిలా..
గత నెలలో వరంగల్ చేరుకున్న వీరిద్దరూ మొదట మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్ను దొంగిలించారు. ఆ బైక్పై తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని పుస్తెల తాడులను తెంచుకుపోయేవారు. సుబేదారి పరిధిలో రెండు, హన్మకొండలో ఒకటి, కేయూసీ పరిధిలో ఒకటి.. ఇలా వరంగల్లో నాలుగు చోట్లతో పాటు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఒక చోట కలిపి మొత్తం ఐదు చోట్ల చెయిన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు.
* పోలీసుల చాకచక్యం:
వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో సెంట్రల్ జోన్ డిసిపి దారా కవిత ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కదలికలను నిరంతరం గమనించిన పోలీసులు.. మంగళవారం నిందితులు మరోసారి చోరీకి ప్రయత్నిస్తుండగా హన్మకొండ బస్ స్టాండ్ సమీపంలో పట్టుకున్నారు.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన డీసీపీ దారా కవిత, అడిషనల్ క్రైమ్ డీసీపీ బి. బాలస్వామి, ఏసీపీలు సదయ్య, నరసింహరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, రామకృష్ణ మరియు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
