* సైబర్ నేరగాళ్ల పన్నాగం
* కంపెనీల డేటాకు గండం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతుందో.. సమస్యలు కూడా అదే స్థాయిలో ఉత్పన్నం అవుతున్నాయి. కృత్రిమ మేధ (AI) విస్తృతి పెరిగాక అవకాశాలు, కార్యకలాపాలు ఈజీగా మారాయి. దీంతో చిన్న స్టార్టప్‌ల నుంచి బడా మల్టీ నేషనల్ కంపెనీల వరకు అంతా ఇప్పుడు ‘ఏఐ చాట్‌బోట్’ల జపం చేస్తున్నాయి. కస్టమర్ల సందేహాలకు క్షణాల్లో సమాధానాలివ్వడం, పని వేగం పెంచడం, ఖర్చు తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉండటంతో సంస్థలు వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, ఈ సాంకేతికత వెనుక ఇప్పుడో సరికొత్త ముప్పు పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదే ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’ (Prompt Injection). దీని ద్వారా సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు తెర తీసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
అసలేంటీ ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’?
సాధారణంగా ఏఐ పని చేయడానికి మనం ఇచ్చే ఆదేశాలను ‘ప్రాంప్ట్’ అంటారు. సైబర్ నేరగాళ్లు ఈ ప్రాంప్ట్‌లనే ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఏఐ మోడల్‌ను తప్పుదోవ పట్టించేలా, ట్రిక్ చేసేలా ‘మలీషియస్ ప్రాంప్ట్స్’ (కీడు చేసే ఆదేశాలు) ఇస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే.. “ఏఐని మాటలతో మాయ చేయడం”. ఇలా ఏఐని కన్ఫ్యూజ్ చేసి, సాధారణంగా బయటపెట్టకూడని సంస్థల అంతర్గత పత్రాలు, కస్టమర్ల రికార్డులు, సిస్టమ్ వివరాలను రాబట్టడమే ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్’.
డేటా భద్రతకు పెను సవాల్
ప్రస్తుతం చాలా సంస్థలు తమ ఏఐ మోడల్స్, చాట్బోట్లను సంస్థలోని కీలకమైన డేటా సిస్టమ్‌లకు (CRM డేటా, హెల్ప్‌డెస్క్ టికెట్లు, ఉద్యోగుల సమాచారం, ఫైనాన్షియల్ రికార్డులు) అనుసంధానిస్తున్నాయి. ఎండ్ యూజర్‌కు ఈ సమాచారం పొరపాటున కూడా కనిపించకూడదు. కానీ, హ్యాకర్లు వేసే ఒకే ఒక్క ‘ట్రిక్కీ ప్రాంప్ట్’ వల్ల ఈ గోప్య సమాచారమంతా బయటపడే ప్రమాదం ఉంది.
నివారణకు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
ఈ ముప్పును పసిగట్టి, నివారించడానికి సంస్థలు తక్షణమే ‘ప్రాంప్ట్ గార్డ్రెయిల్స్’ (రక్షణ కవచాలు) ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక అంచె భద్రత సరిపోదు, మల్టీ-లేయర్ డిఫెన్స్ విధానాన్ని పాటించాలి.
* మోడల్-లెవల్ సెక్యూరిటీ: ఏఐకి సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడం, కఠినమైన నిబంధనలు (Hard Guardrails) విధించడం ద్వారా అనవసర సమాచారాన్ని ఇవ్వకుండా నియంత్రించాలి.
* ప్రాంప్ట్-లెవల్ సెక్యూరిటీ: హానికరమైన (Malicious) ప్రాంప్ట్‌లను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
* సిస్టమ్-లెవల్ సెక్యూరిటీ: ఏఐకి యాక్సెస్ ఇచ్చే డేటా, ఏపీఐ (API)లపై కఠిన నియంత్రణలు ఉండాలి.
* ఆడిట్స్ & యాక్సెస్: ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఆడిట్స్ నిర్వహిస్తూ.. డేటా యాక్సెస్‌ను పరిమితం చేయాలి.
……………………………………………………
