Cyclone Akvan
* చెన్నైకి 610 కి.మీ దూరంలో తుపాను కేంద్రం
* నవంబర్ 19న తీవ్ర తుపానుగా మారే అవకాశం
ఆకేరు న్యూస్, డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను (Cyclone Akvan) క్రమంగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని (Bay of Bengal) మధ్య ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఈ తుపాను మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
Also Read: కాజీపేట భూముల వివాదం..
వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. నవంబర్ 17వ తేదీ ఉదయం 8.30 గంటల సమయానికి తుపాను చెన్నైకి తూర్పున 610 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి ఆగ్నేయంగా 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు అధికారులు తెలిపారు.
మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం
అక్వాన్ తుపాను నవంబర్ 17వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుపానుగా (Severe Cyclonic Storm) మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం నవంబర్ 19వ తేదీ ఉదయం నాటికి అతి తీవ్ర తుపానుగా (Very Severe Cyclonic Storm) బలపడే సూచనలు ఉన్నాయని తెలిపింది.
20న తీరం దాటే సూచనలు
ప్రస్తుత అంచనాల ప్రకారం.. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఆంధ్రప్రదేశ్, యానాం తీరాల మధ్య నెల్లూరు నుంచి తుని ప్రాంతాల మధ్య అక్వాన్ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గాలుల వేగం అప్పుడప్పుడు 145 కిలోమీటర్ల వరకు చేరవచ్చని ఐఎండీ హెచ్చరించింది.
భారీ వర్షాలకు అవకాశం
తుపాను ప్రభావంతో నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ నవంబర్ 20, 21 తేదీల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

