* అంతర్ జిల్లా విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్!
ఆకేరు న్యూస్, వరంగల్: రైతుల పాలిట శాపంగా మారిన అంతర్ జిల్లా విద్యుత్ మోటార్ల దొంగల ముఠాను వరంగల్ సీసీఎస్ మరియు కమలాపూర్ పోలీసులు సంయుక్తంగా చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 6,16,000 రూపాయల విలువైన 71 కరెంటు మోటార్లను, దొంగతనాలకు వాడిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
గత కొంతకాలంగా వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లోని వ్యవసాయ బావులు, కాలువల వద్ద అమర్చిన కరెంటు మోటార్లు మాయమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సీరియస్ గా స్పందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్, IPS ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
పట్టుబడ్డ నిందితులు వీరే:
పోలీసుల విచారణలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరంతా పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లాలకు చెందినవారు:
సిరిగිරි ప్రసాద్ (26)
మోతె రాజు (25)
టేకు నవీన్
మాటం తిరుపతి
వారణాసి లక్ష్మణ్ (26)
మాటం నరేష్ (25)
వస్తం భీమేష్ (28)
దొంగతనాల తీరు – విలాసాల కోసమే నేరాలు…
ఈ ముఠా సభ్యులు జల్సాలకు, మద్యానికి అలవాటు పడి తేలికగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. వీరు పగటిపూట రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో వ్యవసాయ క్షేత్రాల్లోని మోటార్లను దొంగిలించేవారు. గతంలో వీరు కరీంనగర్, రామగుండం పరిధిలో ట్రాన్స్ఫార్మర్ల వైర్లు దొంగిలించి జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయినా బుద్ధి మార్చుకోకుండా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్, దామెర స్టేషన్ల పరిధిలో 34 మోటార్లు, కరీంనగర్ పరిధిలో 36, భూపాలపల్లి జిల్లాలో 1 మోటార్‌ను చోరీ చేశారు.
పోలీసుల మెరుపు దాడి:
నమ్మదగిన సమాచారం మేరకు సీసీఎస్ మరియు కమలాపూర్ పోలీసులు వంగపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక టాటా ఏస్ (AP 27 TW 7684) మరియు మారుతీ 800 కార్ (AP 10 P 1532) లను ఆపి తనిఖీ చేయగా దొంగతనం సొత్తు బయటపడింది. నిందితులను విచారించగా పరకాలలోని ఒక ఇంట్లో దాచిన మరికొన్ని మోటార్ల వివరాలను వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
71 కరెంటు మోటార్లు (విలువ రూ. 6,16,000/-)
టాటా ఏస్ ఆటో ట్రాలీ
మారుతీ 800 కారు
7 సెల్ ఫోన్లు ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లు ఎ. రాఘవేందర్, కె. రామకృష్ణ, కమలాపూర్ ఇన్స్పెక్టర్ నవీన్ మరియు ఇతర సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.
