
* కమ్యూనిస్ట్ దిగ్గజ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
* సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎంపిక
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన దైన ముద్ర
* తెలంగాణ ఉద్యమానికి పూర్తి మద్దతు..
* సీపీఐ పార్టీకి తీరని లోటు
ఆకేరు న్యూస్ డెస్క్ : కమ్యూనిస్ట్ సీనియర్ నేత,సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శిమాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (83) కన్నుమూశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో ఉన్న కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్ లోని మణికొండలో నివాసముంటున్న ఆయనకు భార్య బీవీ విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. చండ్ర రాజేశ్వర రావు తరువాత మూడు సార్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం పనిచేశారు.వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సురవరం పాత్రికేయుడిగా, సామాజిక కార్యకర్తగా కూడా పనిచేశారు. జోగులాంబ గద్వాల జిల్లా, కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న ఈశ్వరమ్మ, వెంకట్రామిరెడ్డి దంపతులకు జన్మించారు. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు.
బాల్యం నుంచే పోరుబాట..
సురవరం సుధాకర్ రెడ్డికి బాల్యం నుంచే పోరాడే తత్వం ధైర్యంగా మాట్లాడే నైజం. కర్నూల్లోని మున్సిపల్ హైస్కూల్, కోల్స్ మెమోరియల్ హైస్కూల్లలో విద్యాభ్యాసం ఆయన కొనసాగింది. ఆయన తన చదువు కోసం కర్నూలు వెళ్లి 15 ఏళ్ల వయసులో తమ పాఠశాలకు బ్లాక్ బోర్డులు, పుస్తకాలు కావాలంటూ జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే సుధాకర్ రెడ్డి కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. సుధాకర్ రెడ్డి 1960లో CPI విద్యార్థి విభాగమైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF)లో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో వెంకటేశ్వర యూనివర్సిటీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కార్యదర్శిగా పనిచేసి 62 రోజులపాటు సమ్మెకు నాయకత్వం వహించాడు.1964లో కర్నూలులో బీఏ చేసిన ఆయన కళాశాల విద్యార్థి సంఘం ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. 1964లో కర్నూల్లో బీఏ పూర్తిచేశాడు. 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీ పట్టా అందుకొని ఆ తర్వాత హైదరాబాద్ న్యాయ కళాశాలలో చేరిన వారంలోనే విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించాడు. ఆ ఎన్నికల అనంతరం ఆయన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించాడు. 1970లో ఏఐఎస్ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1974 ఫిబ్రవరి 19న ఆయనకు విజయలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. 1974 నుంచి 1984 వరకు సీపీఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశాడు. 1980, 1985లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 1994లో కర్నూలులోని డోన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1998లో నల్గొండ నుండి 12వ లోక్సభకు మొదటిసారి ఎన్నికయ్యాడు. 2000లో ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియామకమయ్యారుడు. 2004లో నల్గొండ నుండి 14వ లోక్సభకు రెండవసారి ఎన్నికయ్యాడు.2012 పట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాడు. 2015లో పుదుచ్చేరిలో, 2018లో కొల్లాంలో జరిగిన సీపీఐ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాడు. 2021 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో 2019 జులై 24న స్వయంగా తప్పుకున్నాడు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ..
మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలిపిన సీపీఐ పార్టీ తర్వాత ప్రత్యేక ప్యాకేజీతో తెలంగాణలోని వెనుకబాటుతనాన్ని రూపుమాపవచ్చని భావించింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదని గుర్తించి సీపీఐ వైఖరిని మార్చుకుంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ఉద్యమానికి సీపీఐ ఇచ్చిన మద్దతు మరింత బలం చేకూర్చింది. దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేశరాజకీయాల్లో సురవర్ సుధాకర్ రెడ్డి తన తైన ముద్ర వేశారు విలువలతో కూడిన రాజకీయాలనే ఆయన నమ్మకున్నారు. సుధాకర్ రెడ్డి మరణం కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటు
……………………………………………………