
* మొన్న పెళ్లి… నేడు మరణం..
* రిసెప్షన్ ఏర్పాట్లలో ఉండగా పెళ్ళికొడుకును కాటేసిన కరెంట్
ఆకేరున్యూస్, మహబూబాబాద్ : మొన్న అంగరంగ వైభవంగా వధువు ఇంట్లో విజయవాడలో వివాహం జరిగింది. కళ్యాణవేడుక, అప్పగింతలు అన్ని పూర్తి చేసుకొని నిన్న తెల్లవారుజామున వరుడు సతీసమేతంగా మహబూబాబాద్ జిలా బయ్యారం మండలం కోడిపుంజులతండాలోని తమ ఇంటికి చేరుకున్నాడు. ఈరోజు రిసెప్షన్ ఉండడంతో బంధుమిత్రులందరికీ విందుబోజనాల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అంతలోనే పెనువిషాదం చోటుచేసుకుంది. కోడిపుంజుల తండాలో విద్యుత్ షాక్‌తో నవవరుడు మృతిచెందగా.. ఈ సంఘటనతో వధువు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కోడిపుంజుల తండా వాసి ఇస్లావత్ నరేష్‌కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈనెల 18న విజయవాడలో వివాహం జరిగింది. నిన్న నూతన జంట వరుడి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ రోజు మంగళవారం వరుడి ఇంట్లో రిసెప్షన్ జరగాల్సి ఉండగా.. ఉదయం ఇంట్లోని బోరు మోటరు కోసం విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా నూతన వరుడు నరేష్‌కు షాక్ తగిలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో జాహ్నవి కూడా అస్వస్థతకు గురయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పెండ్లివేడుక సందర్భంగా బంధుమిత్రులు, కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాలతో ఉన్నసమయంలో ఈ ఘటన చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
……………………………..