Naini Rajender Reddy
* ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
Naini Rajender Reddy| ఆకేరు న్యూస్, హనుమకొండ: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని అన్నారు.
ఏఐసీసీ పిలుపు మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి సోమవారం ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కలెక్టరేట్ వరకు పాదయాత్ర
హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి హనుమకొండ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా పారదర్శక విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆరోపణలపై విచారణ
ఎన్నికల వ్యవస్థకు సంబంధించి వస్తున్న ఆరోపణలు, అభ్యంతరాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని నాయిని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల్లో మార్పులు, ఓట్ల తొలగింపు, ఓటు హక్కుకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు లేకుండా స్పష్టమైన విధానం ఉండాలని కోరారు.
బీజేపీపై విమర్శలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. “గుడి, బడి దోచుకున్న బీజేపీ ఇప్పుడు మన ఓట్లను కూడా దోచుకుంటుంది” అంటూ ఆయన విమర్శలు చేశారు. ప్రజల ఓటు హక్కుకు భంగం కలిగే చర్యలను కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి సహించబోదని అన్నారు.
వరంగల్ ప్రజా ఉద్యమాలకు, చైతన్య కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్న ఆయన.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమానికి వరంగల్ నుంచే బలమైన నాంది పలికామని అన్నారు.
ఇండియా కూటమి బలోపేతం
రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి మరింత బలోపేతం అవుతుందని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుసూరు పాషా, సంఘ వెంకట్రాజం, కుడా చైర్మన్ గుండు సుధారాణి, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, ఇండియా కూటమి నాయకులు తక్కలపల్లి శ్రీనివాసరావు, ప్రభాకర్ రెడ్డి, నున్న అప్పారావు, జిల్లా రాజేంద్రప్రసాద్, బిక్షపతి, టీపీసీసీ ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దుద్దిల శ్రీనివాస్ బాబు, ఈవీ శ్రీనివాసరావు, బత్తిని శ్రీనివాస్ రావుతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
