Deputy CM Bhatti Vikramarka Adilabad
* ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు, ₹5 లక్షల భీమా
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్:నాడు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పిప్పిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని, సుమారు రూ. 1238 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
* సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఈ సభ…
ఈ కార్యక్రమం కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే సాధ్యమైందని భట్టి తెలిపారు. “మనం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సీఎం నాతో మాట్లాడారు. నాడు పిప్పిరి నుంచి ఖమ్మం వరకు మీరు చేసిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుచేశారు. ఆ హామీలన్నిటికీ నిధులు మంజూరు చేసి, భూమిపూజ నిర్వహించాలని సూచించారు” అని పేర్కొన్నారు.
* విద్యారంగంలో సరికొత్త చరిత్ర…
సామాజిక అంతరాలు లేని నవ సమాజం కోసం ప్రభుత్వం యంగ్
ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని భట్టి తెలిపారు. ఒక్కో పాఠశాలను సుమారు రూ. 200 కోట్ల వ్యయంతో, 20 నుండి 25 ఎకరాల ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. “ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి బిడ్డకు ఉదయాన్నే అల్పాహారం (Breakfast), ఒక గ్లాసు పాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం” అని ప్రకటించారు.
* పేదలకు భరోసా: ఇందిరమ్మ ఇళ్లు, ₹5 లక్షల భీమా…
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని, ఇందుకోసం రూ. 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే, దురదృష్టవశాత్తు కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా రూ. 5 లక్షల ఇందిరమ్మ భీమా సౌకర్యం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఫ్యూడల్ శక్తులపై గర్జన…
“మేము పాలకులు కాదు.. ప్రజల సేవకులం. ప్రజల అవసరాలే మా ఎజెండా. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల చేత పాలించబడాలి తప్ప ఫ్యూడల్స్ చేత కాదు” అని భట్టి వ్యాఖ్యానించారు. ప్రతి పైసాను పోగేసి ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని, ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
