*రూ. రెండు లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఆకేరు న్యూస్, మంచిర్యాల : డిప్యూటీ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కాడు. రూ. రెండు లక్షలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ రాథోడ్ భిక్కు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మంచిర్యాల పట్టణంలోని ఆయన అద్దె ఇంటిపై శనివారం ఉదయం దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జూర్ పీఎస్సీఎస్ మాజీ సీఈవో వెంకటేష్ గౌడ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు లంచం డిమాండ్ చేశాడని తెలిపారు. 2023 ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించేందుకు సస్పెన్షన్ కాలానికి సంబంధించిన జీతభత్యాలు మంజూరు చేయడానికి, విచారణ నివేదికపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు సస్పెండ్‌కు గురైన ఉద్యోగి వద్ద లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దాడి అనంతరం నిర్వహించిన రసాయన పరీక్షలో రాథోడ్ కుడిచేయి వేళ్లు, లంచం డబ్బు తాకిన బనియన్ భాగం పాజిటివ్‌గా తేలిందని అధికారులు స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరించేందకు రాథోడ్ ముందుగా రూ.7 లక్షలు లంచంగా డిమాండ్ చేశాడు. పలుమార్లు అభ్యర్థించడంతో మొత్తం రూ.5 లక్షలకు ఒప్పకున్నాడు. తొలి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాథోడ్‌ది ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనాయక్ తండా. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఇన్చార్జిగా గానూ ఉన్నారు.
…………………………………………………….
