* స్థలాల కొనుగోలుకు ఆసక్తి
* రియల్టర్లు, డెవలపర్లలో ఉత్సాహం
* గ్లోబల్ సమ్మిట్ అనంతరం మారిన దిశ
* లే అవుట్లలో వీకెండ్ విజిట్లు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
అభివృద్ధికి కేరాఫ్ హైదరాబాద్ నగరం. ఇది ఎప్పటి నుంచో అందరికీ తెలిసిందే. అయితే అభివృద్ధి ఎక్కువగా హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్ వైపే ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు సౌత్ వైపు దృష్టి సారించడం, ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టడంతో అటువైపు కూడా అందరి దృష్టి పడింది. గ్లోబల్ సమ్మిట్ అనంతరం ఆ ప్రాంతం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్యూచర్ సిటీతో ఈ ప్రాంతం రూపురేఖలు మారడంతో పాటు ఇక్కడ పెట్టే ప్రతీ పైసా భవిష్యత్తుకు మంచి పెట్టుబడిగా మారుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
క్రయ, విక్రయాలకు అవకాశం
భారత్ ఫ్యూచర్ సిటీ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత హైదరాబాద్ మహా నగరానికి దక్షిణ దిశలో రియల్ ఎస్టేట్‌కు కొంత ఊపునిచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ విజయం అనంతరం మరింత పెరిగింది. ఫ్యూచర్ సిటీకి సమీపంలో లేఅవుట్ వేసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు సైట్ విజిట్లకు భారీ ప్లాన్ చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కార్లలో వందల మంది లేఅవుట్ల సందర్శనలకు వెళ్తున్నారు. అలా వెళ్లిన వారికి నిర్వాహకులు లే అవుట్లే కాకుండా, గ్లోబల్ సమ్మిట్ జరిగిన ప్రాంతాన్ని, ఫ్యూచర్ సిటీ పరిసరాలను కూడా చూపిస్తున్నారు. పలు రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు గ్లోబల్ సమ్మిట్‌ను తమ ప్రాజెక్టు క్రయ, విక్రయాలకు ఓ అవకాశంగా మలుచుకున్నారు.
కార్లు, బస్సుల్లో..
ప్యూచర్ సిటీ ప్రాంతంలో ఇటీవల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగడంతో రియల్ ఎస్టేట్, డెవలపర్లలో ఎనలేని సంతోషాన్ని నింపింది. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి సమీపంలోని డెవలపర్లు మరింత ఉత్సాహంగా ఉన్నారు. తమ లే అవుట్ల సందర్శనకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. దీంతో లేఅవుట్ల విజిట్లను పెంచారు. ముఖ్యంగా శ్రీశైలం హైవేతో పాటు నాగార్జున్‌సాగర్ మార్గంలోని పలు లేఅవుట్లలో సందర్శకులకు విజిట్ల కోసం కార్లు, బస్సుల్లో తీసుకొస్తున్నారు. ప్రతీ ఆదివారం ఎక్కువగా జరుగుతున్నాయి.
మరిన్ని లే అవుట్లు
భారత్ ప్యూచర్ సిటీ ప్రాంతంలో భూములను కొనుగోలు చేయడంతో పాటు భారీ లేఅవుట్లను తీసుకొచ్చేందుకు పలు రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన కొన్ని సంస్థల ప్రతినిధులు, డెవలపర్లు కూడా పరిసర ప్రాంతాల్లో భూముల ధరలను వాకబు చేసినట్లు సమాచారం. ఇక్కడ సంస్థలు నెలకొల్పేందుకు సమ్మిట్‌లో ఒప్పందాలు జరగడంతో భవిష్యత్‌లో అభివృద్ధికి అవకాశం ఉందని భావిస్తున్నారు. పెట్టుబడులకు కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. మున్ముందు ఎటువంటి అద్భుతాలు జరగనున్నాయో వేచి చూడాలి.
………………………………………….
