ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గతంతో పోలిస్తే 2.33 శాతం నేరాలు తగ్గినట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నమ్మకద్రోహం కేసులు 23 శాతం పెరగడం ఆందోళకరమని అన్నారు. తెలంగాణ పోలీసు వార్షిక నివేదిక – 2025ను ఆయన మంగళవారం విడుదల చేశారు. తెలంగాణలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని, అందులో 23 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలూ రాకుండా మిస్ వరల్డ్ ఈవెంట్, ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. రాష్ట్రంలో వివిధ కేసులను లోక్ అదాలత్ ద్వారా పెద్ద సంఖ్యలో పరిష్కరించామన్నారు. తెలంగాణ పోలీసుశాఖ కీలక పదవుల్లోనూ మహిళలు పని చేస్తున్నారని వెల్లడించారు. గతంలో 2.34 లక్షల కేసులు నమోదు కాగా, ఇప్పుడు 2.28 లక్షల కేసులు నమోదయ్యాయని వివరించారు. రాష్ట్రంలో బీఎన్ ఎస్ కేసుల సంఖ్య 1.5 శాతం తగ్గిందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్దవంతంగా నిర్వహించామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరదలను కూడా సమర్దవంతంగా ఎదుర్కొన్నామన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదలు నిజామాబాద్లో రాలేదన్నారు. వరదల సమయంలో పోలీసు సిబ్బంది బాగా పనిచేసి ప్రాణనష్టం లేకుండా చూశారన్నారు. ఈ ఏడాది నాలుగు కేసుల్లో మరణశిక్షలు పడ్డాయన్నారు. 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ శిక్షలు పడ్డాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టం 28 కేసుల్లో 53 మందికి జీవితఖైదు పడిందని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో సైబర్ క్రైం 3 శాతం తగ్గిందని, ఈ కేసుల్లో రికవరీ 23 శాతం పెరిగిందన్నారు.
…………………………………………………..

