
* విజయనగరం జిల్లాలో కలకలం
* ఆరా తీసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, విజయనగరం : ఏపీలోని విజయనగరం జిల్లాలో డయేరియా కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఐదుగురు మృతి చెందడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలోని మండల కేంద్రమైన గుర్లలో అతిసారం బారిన పడి రెండు రోజుల క్రితం ఒకరు మృతిచెందగా మంగళవారం మరో నలుగురు మరణించారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. వరుస మరణాలతో గుర్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజులుగా గ్రామంలో పలువురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తోండ్రంకి రామయ్యమ్మ (60) అనే వృద్ధురాలు మంగళవారం ఇంటివద్దే చనిపోయారు. సారిక పెంటయ్య (65) అనే వృద్ధుడు విజయనగరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. గుమ్మడి పైడమ్మ (50) విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కలిశెట్టి సీతమ్మ (45) అనే మహిళను చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మరో 10 మంది దాకా డయేరియా వ్యాధితో బాధపడుతూ విజయనగరం, విశాఖలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా మరణాలపై సీఎం చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. బాధితుల పరిస్థితి, వైద్య సేవలపై ఆరా తీశారు. ఎమ్మెల్యే కళా వెంకట్రావు, జిల్లా కలెక్టర్ బాధితులను పరామర్శించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టారు.
………………………………………