
* చర్చనీయాంశంగా కవిత రాజకీయ అడుగులు
* కొద్ది రోజులుగా అనూహ్య మార్పులు
* తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభం నుంచీ వ్యూహాలు
* బీఆర్ ఎస్ ముఖ్య లీడర్లే టార్గెట్ గా విసుర్లు
* తండ్రిని పొగుడుతూ.. గులాబీ పార్టీకి ముల్లు గుచ్చుతూ..
* నాలుగు నెలలుగా తెలంగాణలో ఆసక్తికర రాజకీయం
* నేటి కవిత ప్రెస్ మీట్ లో కొత్త పార్టీ ప్రకటన ఉంటుందా.?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్ స్టోరీ హాట్ టాపిక్ గా మారిపోయింది. సస్పెన్షన్‌పై కవిత ఇప్పటి వరకు పెదవి విపల్లేదు. ఎందుకంటే దీన్ని ఆమె ఎప్పుడో ఊహించినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అలాగే అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా కవిత సస్పెన్షన్ ను ఎప్పుడో ప్రస్తావించారు. కవితను సస్పెండ్ చేసేందుకు బీఆర్ ఎస్ లో స్కెచ్ నడుస్తోందని, ఓ బృందం ఆ దిశగా పని చేస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి మే నెలలోనే వెల్లడించారు. అందుకు ఓ స్కెచ్ బృందం పనిచేస్తోందన్నారు. సంతోష్ రావు, కేటీఆర్, హరీశ్‌రావులు కలిసి ఆమెను పార్టీ నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిబట్టి కవిత లేఖ బయటకు రాక ముందు నుంచే బీఆర్ ఎస్ లో లుకలుకలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. దీన్ని ముందే గుర్తించిన కవిత పార్టీ నేతలపైనా, సోదరుడిపైనా నేరుగా విమర్శలు మొదలుపెట్టారు. దీంతో బీఆర్ ఎస్‌లో ఎందుకిలా జరుగుతోందన్న చర్చ మొదలైంది.
జైలు నుంచి వచ్చిన నాటి నుంచీ..
లిక్కర్ స్కామ్ తర్వాత కవిత జీవితంలో పెనుమార్పులు మొదలయ్యాయి. అరెస్టు సమయంలో నేనున్నా.. నీకేం కాదని అన్న రామన్న ఆమెకు భరోసా ఇచ్చారు. త్వరలోనే బయటకు తీసుకువస్తానని పేర్కొన్నారు. లిక్కర్ స్కాం కేసులో ఆమె తీహార్ జైల్లో వంద రోజులుకు పైగా ఉన్నారు. అతికష్టం మీద బయటకు వచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.., బీజేపీతో రాజీపడి ఆమెను బయటకు తీసుకువచ్చారని ప్రచారం జరిగింది. అది ఎంత వరకు వాస్తవమనేది పక్కన పెడితే.., అప్పటి నుంచీ పార్టీ వ్యవహారాల్లో కవిత దూరంగా ఉండడం కనిపించింది. ఆస్తి తగాదాలో, అధికారం కోసం విభేధాలో తెలియదు కానీ అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్ ఏర్పడింది. దీంతో కవిత వేరు అడుగులు వేయడం ప్రారంభించారు. కవిత అమెరికా వెళ్లిన తరువాత ఆమె పేరుతో లేఖ లీక్ అయ్యింది. ఆ లేఖ నాడు పెను సంచలనం సృష్టించింది. ఇక అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చాక లేఖ వ్యవహారంపై కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్.. బీఆర్ఎస్ను షేక్ చేశాయి.
తెలంగాణ జాగృతి పేరుతోనే..
తనకు తాను రాజీనామా చేయకుండా, కొత్త పార్టీ ఎందుకు పెడతా తనకు బీఆర్ ఎస్ ఉండగా అని చెబుతూనే.., తెలంగాణ జాగృతి పేరుతోనే అన్ని కార్యక్రమాలూ చేయడం ప్రారంభించారు. అంతకు ముందు ఇందిరాపార్కులో చిన్నగా ఉన్న జాగృతి కార్యాలయాన్ని మూసివేసి, మే 31న బంజారాహిల్స్ లో, తన ఇంటికి సమీపంలోనే అట్టహాసంగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో ఎక్కడా గులాబీ వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్క కేసీఆర్ ఫొటోకు తప్ప మిగతా వాటికి ఆమె స్థానం కల్పించలేదు. ఆ తర్వాత నుంచి ఆమె తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. జాగృతి కండువాతోనే కనిపిస్తూ వస్తున్నారు. కేసీఆర్ కు మద్దతుగా, బీఆర్ ఎస్ తీరుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అంతేకాదు.. పోటీగా సంఘాలూ ప్రారంభించారు.
మరింత పెరిగిన దూరం
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవిత.. జాగృతి పేరుతో కొత్త కమిటీలు ప్రకటించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. టీబీజీకేఎస్‌కు గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ పేరును ప్రకటించారు. అంటే కవితను ఆ పదవి నుంచి తొలగించారన్నమాట. ఈ సమయంలో కవిత అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి కవిత ఒక లేఖ విడుదల చేశారు. తనపై కొందరు కుట్రలు చేస్తున్నారంటూ ఆ లేఖలో ఆరోపణలు గుప్పించారు. మొత్తంగా ఈ వ్యవహారం కూడా కవిత, బీఆర్ఎస్ పార్టీ మధ్య దూరం మరింత పెంచింది.
మరో పోరాటం
తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు.. సీబీఐ విచారణపై ఆమె స్పందిస్తూ బీఆర్ ఎస్ కీలక నేతలపై తీవ్రమైన విమర్శలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వెనుక హరీష్ రావు, సంతోష్ రావు, మేఘా రామకృష్ణా రెడ్డి ఉన్నారంటూ నేరుగా వ్యాఖ్యానించింది. ఈక్రమంలోనే ఆమె సస్పెన్షన్ కు గురైంది. అయితే.. గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే.. పార్టీ నుంచి బయటకు పోవడానికి కవిత ముందే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తాను పోకుండా, పొమ్మనేలా చేసుకుని.. నిజాలను చెబితే, లోపాలను ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అనే పంథాలో ఆమె మరో పోరాటానికి సిద్ధం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది నెలలుగా బీఆర్ ఎస్ ముఖ్య లీడర్లే టార్గెట్ గా ఆరోపణలు గుప్పిస్తున్న కవిత.. తన సస్పెన్షన్ పై నేడు స్పందించే అవకాశాలు ఉన్నాయి. తండ్రిని పొగుడుతూనే మరి కొందరి కీలక నేతలను తిడుతూ గులాబీ పార్టీని పరేషాన్ చేస్తున్న ఆమె నేడు ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే.
…………………………………………………..