* ఆరేళ్లుగా పలు విధాలుగా సాయం చేస్తున్న విద్యావేత్త శ్రీనివాస్
* అందరికీ విద్య అందాలనేదే లక్ష్యం..
ఆకేరు న్యూస్, వరంగల్ : గూడూరు మండలం తీగలవేణి గ్రామం పాటిమీది తండాకు చెందిన ధరావత్ శ్రీనివాస్ ఆరేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఆర్థిక సాయం అందజేస్తున్నాడు. విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్కులు , స్టేషనరీ వస్తువులు ప్రతి సంవత్సరం తన సొంత డబ్బులతో పంపిణీ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి.. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు సంపన్న వర్గాల పిల్లలతో సమానంగా విద్యలో ముందుకు పోవాలనే లక్ష్యంతో సాగుతున్నాడు.. మంగళవారం గూడూరు మండలం లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అదేవిధంగా పాటి మీద తండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుల సమక్షంలో టీ షర్టులు పంపిణీ చేశారు. యువకుడి సేవ భావాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, స్నేహితులు అభినందిస్తున్నారు.
విద్య అన్నిటికీ మూలం..
ఈ సందర్భంగా విద్యావేత్త ధరావత్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు విద్యలో అందరితో సమానంగా ముందు ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడమే తన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక మూసివేసే పరిస్థితి రాకుండా ఉపాధ్యాయులు గ్రామస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే పేద పిల్లలకు విద్యలో న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం పాటిమీద తండా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.

……………………………………………….
