
* బర్డ్ ఫ్లూ నేపథ్యంలో భారీగా తగ్గిన ధర
* ఇదే అదునుగా కొందరు వక్రమార్గం
* అధిక సంఖ్యలో నిల్వలు
* వైన్స్, బార్ల దుకాణాలకు తరలింపు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
బర్డ్ ఫ్లూ కోళ్లకు మరణశాసనంగా మారింది. ఆ మహమ్మారికి కోట్లాది కోళ్లు బలి అవుతున్నాయి. వైరస్‌ను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలను ఓ పక్క తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా చేస్తున్నాయి. వైరస్ నిర్ధారణ అయిన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. మరోపక్క ఈ వైరస్ భయంతో ప్రజలు కోడి తినాలా.. వద్దా అని ఆలోచిస్తున్నారు. భయంతో తినేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో విక్రయాలు లేక కోడి దుకాణాలు బోసిపోతున్నాయి. ఆదివారం పూట వినియోగదారుల లైన్లతో బిజీగా ఉండే దుకాణాలు సైతం ఈ ఆదివారం ఖాళీగా కనిపించాయి. విక్రయాలు లేక చికెన్ ధర కూడా బాగా తగ్గింది. కొద్ది రోజుల క్రితం 230 నుంచి 250 వరకు అమ్మిన కేజీ చికెన ధర ప్రస్తుతం 160 నుంచి 190 ఉంటోంది. పెంచిన కోళ్లు మృతి చెందుతుడడం, కోడి ధర తగ్గడంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ అవకాశాన్ని కొందరు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. తక్కువ ధరకు చికెన్ కొనేసి.. అధిక మొత్తంలో నిల్వలు చేస్తున్నారు.
కోల్ట్ స్టోరేజీలో నెలల తరబడి..
ఇటీవల హైదరాబాద్‌లోని అన్నానగర్ లో వెలుగుచూసిన ఘటనతో కుళ్లిన చికెన్ బాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. బేగంపేట్ అన్నానగర్‌లో ఆహారభద్రత అధికారుల తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 600 కిలోల చికెన్‌ను గుర్తించారు. ఈ దాడులలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పూర్తిగా కుళ్లి పాడైపోయిన స్థితిలో ఉన్న చికెన్‌ను విక్రయించి లాభాలు సంపాదిస్తున్నారని కంటోన్మెంట్ శానిటేషన్ సూపరింటెండెంట్ దేవేందర్ వెల్లడించారు. ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీలో నెలల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని అతి తక్కువ ధరలకే సమీపంలోని మద్యం దుకాణాలు, బార్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే.. వెలుగులోకి ఈ తరహా ఉదంతాలు హైదరాబాద్ లో చాలానే ఉన్నాయి.
వెలుగులోకి కొన్నే..
చికెన్ కు ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో చాలా మంది సప్లయర్స్ వాటిని కొనుగోలుచేసి భారీ ఎత్తున నిల్వలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నిల్వ చేసిన మాంసాన్ని ఎక్కువగా మద్యం దుకాణాలకే సరఫరా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లలో ఒకేసారి అధిక మొత్తంలో కొనుగోలు చేసి రెండు మూడు వారాల పాటు నిల్వ ఉంచుతారు. అంతకు ముందే కొందరు సప్లయర్స్ మరో నెల రోజులకు ముందే నిల్వ ఉంచుతున్నారు. ధర తగ్గడాన్ని వారు క్యాష్ చేసుకుంటున్నారు. అన్నానగర్ లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినా, పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీగా చికెన్ నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు దాడులు చేస్తే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నగరంలోని చాలా బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా పాతబస్తీ నుంచే చికెన్ సరఫరా అవుతోంది.
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్.. తినొచ్చా లేదా.
కొన్నిచోట్ల కుళ్లిన చికెన్ నిల్వలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, సాధారణంగా విక్రయాలు జరిపే దుకాణాల్లో ఫ్రెష్ చికెన్ నే విక్రయిస్తున్నారు. కొందరు సుచిశుభ్రతలను పాటిస్తున్నారు. అయినప్పటికీ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ తినేందుకు చాలా మంది ఆలోచిస్తున్నారు. వైరస్ సోకిన ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. ముందస్తుగా అనుమానం ఉన్న ప్రాంతాలలో అధికారులు పర్యటించి అక్కడున్న కోళ్లను స్వాధీనం చేసుకుని వాటిని పాతి పెడుతున్నారు. మరికొన్ని చోట్ల పూర్తిస్థాయిలో అమ్మకాలు సైతం నిలిపివేశారు. తీవ్రత ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చికెన్ తినకపోవడం మంచిదే కానీ, మిగతా ప్రాంతాల్లో తినొచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే 70 నుంచి 100 డిగ్రీల వేడిలో ఉడికించి కోడి లేదా ఎగ్ ను తింటే ఎలాంటి సమస్యలు తలెత్తవని వైద్యాధికారులు చెబుతున్నారు.
వైద్య నిపుణులది మరో వాదన..
బర్డ్ ప్లూ వైరస్ సహజంగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు సోకుతుంది. అధికంగా కోళ్ల నుంచి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి బర్డ్ ప్లూ బారినపడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు ఉన్నా కూడా బర్డ్ ప్లూ వస్తుంది. ఈ వ్యాధి సోకిన కోళ్లను తిన్నా మనుషులకు వ్యాపించే అవకాశాలున్నాయి. చికెన్‌ను బాగా శుభ్రం చేసి ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది. ఉడికీ ఉడకని చికెన్ తినడం వల్ల ఇది మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుతం బర్డ్ ప్లూ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో చికెన్ తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
………………………………………………..