
* ఈ వయసులో సరైన పద్ధతి కాదని మందలించిందని..
* ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన బాలిక
* విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..
* కొన ఊపిరితో ఉందని ప్రియుడిని మళ్లీ పిలిపించి..
* ఇన్ స్టా ప్రేమలో పడి.. పాశవికంగా మారి..
* హతురాలు చాకలి ఐలమ్మ ముని మనవరాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అమ్మ తన రక్తమాంసాలు ముద్దలుగా చేసి బిడ్డకు రూపమిస్తుంది. నవ మాసాలు కడుపులో మోసి ప్రాణం పోస్తుంది. బిడ్డ జన్మ సమయంలో ప్రాణాపాయం ఉండొచ్చని తెలిసినా సిద్ధమవుతుంది. పుట్టాక బిడ్డను చూసి మురిసిపోతుంది. నా బంగారు తల్లే.. నా బంగారు కొండే.. అని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంది. ఆ పెరిగి పెద్దదైన ఓ కుమార్తె ఆ తల్లి ప్రేమను పాశాన్ని మరచిపోయింది. చిన్న వయసులోనే ప్రియుడి మోజులో పడి అమ్మనే హతమార్చింది. తల్లీబిడ్డల బంధానికే మచ్చ తెచ్చేలా చేసిన ఈ అమానవీయ ఘటన హైదరాబాద్(Hyderabad)లోని జీడిమెట్లలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. జీడిమెట్లకు చెందిన బాలిక (16) పదో టెన్త్ చదువుతోంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్(Instagram)లో శివ (19) పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఫోన్ లో చాటింగ్ లు.. కుదిరినప్పుడు మీటింగ్‌లు. ఈ విషయం తెలిసి బాలికను తల్లి మందలించింది. ఈ వయసులో ఇది సరైన పద్దతి కాదని, మంచిగా చదువుకోవాలని హితవు పలికింది. అదే ఆమె చేసిన నేరమైంది.
ప్రియుడిని, అతడి తమ్ముడిని ఇంటికి పిలిపించి..
తల్లిపై పగ పెంచుకున్న బాలిక ప్రియుడు, అతడి తమ్ముడు యశ్వంత్ (18)ను ఇంటికి పిలిపించింది. ఈ క్రమంలో శివ, యశ్వంత్ ఇంటికి వచ్చారు. బాలిక తల్లి పూజ గదిలో దేవుడి(God)ని ప్రార్థిస్తోంది. వెనుక నుంచి వచ్చిన శివ ఆమెను రాడ్డుతో కొట్టగా, స్వయంగా ఆమె కుమార్తె (బాలిక) సుత్తితో తలపై కొట్టింది. శివ తమ్ముడు యశ్వంత్ పీక పిసికాడు. అనంతరం వారు వెళ్లిపోగా బాలిక తల్లి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ప్రియుడిని మళ్లీ పిలిచిన బాలిక ఆమెకు ఊపిరి ఆగే వరకూ చంపించింది. స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల (Jeedimetla) పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. చంపిన చున్నీని నిందితుడు నడుముకి కట్టుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లి చాకలి ఐలమ్మ ముని మనవరాలు కావడం గమనార్హం. ఆమె తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్‌గా కూడా ఉన్నారు. తొర్రూరు దగ్గర ఇనుగుర్తి స్వగ్రామం.
………………………………………………….