*కీలక అంశాలపై చర్చ!!
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన ఈ సమావేశంలో చిన్నారెడ్డి ఖర్గేకు పుష్పగుచ్ఛం అందజేసి, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోందని చిన్నారెడ్డి ఈ సందర్భంగా ఖర్గేకు వివరించారు. ఇటీవలి ఎన్నికల్లో 70 శాతం సర్పంచ్ స్థానాలను, 90 శాతం మున్సిపల్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని ఆయన తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాయకులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా చేస్తున్న కృషిని ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు. ఈ భేటీలో రాజకీయ అంశాలతో పాటు తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుపై కూడా చిన్నారెడ్డి చర్చించారు. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో వనపర్తి నియోజకవర్గ బీ-ఫారాన్ని వెనక్కి ఇచ్చే సందర్భంలో అధిష్టానం తనకు ఇచ్చిన హామీని ఖర్గేకు గుర్తు చేశారు. “నాడు పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నేను త్యాగం చేసినప్పుడు, నాకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పిస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరుతున్నాను,” అని చిన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం బాధ్యతలతో పాటు పార్టీ బలోపేతానికి తానూ నిరంతరం కృషి చేస్తున్నానని ఆయన వివరించారు.
