* డీఎల్ విధానంలో కీలక మార్పులు
* వచ్చే నెల నుంచి అమలులోకి ..!
ఆకేరు న్యూస్, హనుమకొండ : రోడ్డు భద్రతపై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాధాలు సంభవిస్తున్నాయి. అత్యంత విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అనేక మంది వికలాంగులుగా మారి కుటుంబాలకు భారమవుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల నియంత్రణకు రవాణాశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్) పొందే విధానంలో కీలక మార్పులు తీసుకొస్తూ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానంలో లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ పరీక్ష, శాశ్వత డ్రైవింగ్ పరీక్ష రెండంచెల విధానం ఉంది. వీటికి అదనంగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ టెస్ట్ తీసుకురాబోతున్నారు. దీనిని వచ్చేనెల మొదటి వారం నుంచి ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకునే ముందు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ కోర్సు తప్పనిసరి కానుంది.
ఇంటి నుంచే పరీక్ష రాయవచ్చు..
రోడ్ సేఫ్టీ టెస్ట్‌లో ముఖ్యంగా ఆరు మాడ్యూళ్లు ఉంటాయి. ఒక్కోటీ 30 నిమిషాలు పాటు ఉంటుంది. అన్నింటికీ కలిపి 3 గంటల సమయం పడుతుంది. రోడ్డు సేఫ్టీ అవగాహనకు శిక్షణతో కూడిన పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం అభ్యర్థులు డెస్క్‌టాప్ కంప్యూటర్, లేదా కెమెరా ఉన్న ల్యాప్‌టాప్‌తో ఇంటి నుంచే పరీక్ష రాయవచ్చు. లేదంటే డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచి హాజరయ్యే అవకాశం ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థికి ప్రత్యేక సర్టిఫికేట్ నంబర్ ఇస్తారు. దాని ఆధారంగానే లెర్నర్ లైసెన్స్ టెస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
కొత్త విధానం గురించి..
– ఇకపై ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ మూడు గంటల కోర్సు పూర్తి చేయాలి.
– ఇందులో ఆరు మాడ్యూళ్లు.. ఒక్కోటి 30 నిమిషాల పాటు ఉంటుంది.
– అభ్యర్థులు తమ ఇంటి నుంచి లేదా ఆఫీసు నుంచి కెమెరా ఉన్న ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్ ద్వారా పరీక్ష రాయవచ్చు. లేదా డ్రైవింగ్ స్కూల్ సెంటర్స్ నుంచి హాజరుకావచ్చు.
– ఆన్లైన్ పరీక్ష పూర్తయిన తర్వాత ప్రత్యేక సర్టిఫికేట్ నంబర్ ఇస్తారు. ఇది ఉంటేనే ఎల్ఎల్ఆర్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది.
మరిన్ని విషయాలు
– రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది.
– కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ఒకేసారి చెల్లించే ‘రోడ్ సేఫ్టీ సెస్’ ఈ నెల నుంచి అమలులోకి వచ్చింది. ఇది ద్విచక్ర వాహనాలకు రూ.2,000, కార్లకు రూ.5,000 గా నిర్ణయించారు.
