Journalism Workshop
* తెలుగు వర్సిటీలో ఆకట్టుకున్న వర్క్ షాప్
* విద్యార్థులను ఆకర్షించిన డ్రోన్స్ ప్రజంటేషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మారుతున్న డిజిటల్ యుగంలో జర్నలిజం రంగం వేగంగా కొత్త పుంతలు తొక్కుతోంది. సంప్రదాయ వార్తా సేకరణ పద్ధతులతో పాటు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ హైదరాబాద్ బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలోని జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రోన్ వర్క్ షాప్ విద్యార్థులను, అధ్యాపకులను విశేషంగా ఆకట్టుకుంది. నేటి పోటీ ప్రపంచంలో విజువల్ స్టోరీ టెల్లింగ్కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, ఆకాశం నుంచి వార్తలను, దృశ్యాలను బంధించే డ్రోన్ టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా నిలిచింది. ఆధునిక మీడియా అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అధ్యాపకులు వెల్లడించారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు..
ఈ వర్క్ షాప్లో టెక్నికల్ పర్సన్ ఎం. పవన్ కుమార్ పాల్గొని డ్రోన్లను వినియోగించే విధానం, వాటి సాంకేతిక అంశాలు, విభిన్న ఉపయోగాల గురించి క్షుణ్ణంగా వివరించారు. బ్రేకింగ్ న్యూస్, ఇతర వార్తా కవరేజీల సమయంలో డ్రోన్ల ద్వారా స్పష్టమైన ఫోటోలు, వీడియోలు ఎలా చిత్రీకరించాలో జర్నలిజం విద్యార్థులకు ఆచరణాత్మకంగా తెలియజేశారు. ముఖ్యంగా వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంలోను, భారీ జనసమూహం ఉండే సభలు, ఉత్సవాల వద్ద పరిస్థితిని గమనించి విషయ సేకరణ చేయడంలోను, అలాగే లైవ్ ఈవెంట్ల కవరేజీలో డ్రోన్లు ఎంత కీలకమో ఆయన సోదాహరణంగా వెల్లడించారు. కేవలం సిద్ధాంతపరమైన వివరణకే పరిమితం కాకుండా, డ్రోన్ ఆపరేటింగ్, వీడియో కవరేజ్ విధానాన్ని విద్యార్థుల సమక్షంలో ప్రత్యక్షంగా ప్రదర్శించి అందరిలో ఆసక్తిని రేకెత్తించారు.
డ్రోన్ల ప్రయోజనాలు.. ఇబ్బందులు
జర్నలిజం అధ్యాపకులు డా. షేక్ సమీర్ పర్యవేక్షణలో విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. షేక్ హసీనా, డా. కే వెంకటేశ్వర్లు, డా. కే అనితతో పాటు వివిధ విభాగాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు డ్రోన్ పనితీరు, కెమెరా కోణాలు, కవరేజీ మెళకువలపై పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సాంకేతికతను జర్నలిజంతో మేళవించి భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన, వేగవంతమైన వార్తా కవరేజీ అందించడంలో డ్రోన్ల ప్రయోజనాలను, వినియోగంలో తలెత్తే ఇబ్బందులను జర్నలిజం విద్యార్థులకు తెలియజేసేందకు ఈ వర్క్ షాప్ నిర్వహించినట్లు డా.షేక్ సమీర్ తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

