* రెండు మెడికల్ దుకాణాల లైసెన్స్ లు రద్దు.. ముగ్గురి అరెస్ట్
* నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ అమ్మకాలపై చర్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో కలిసి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DRUGS CONTROL ADMINISTRATION- PROHIBITION & EXCISE) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కోడైన్ కాఫ్ సిరప్‌ల అక్రమ అమ్మకాలను గుర్తించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, రెండు మెడికల్ షాపుల లైసెన్స్‌లను రద్దు చేశారు. విచారణలో దీని వెనుక పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రామంతాపూర్‌లో వైభవ్ కులకర్ణి, మనుపతి భాను ప్రకాష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద (1.050) కిలోల బరువున్న పొడి గంజాయిని గుర్తించారు. విచారణలో సికింద్రాబాద్‌లోని లాలాపేట్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ కోడైన్ ఫాస్ఫేట్ సిరప్ (ఇందులో ఓ రకమైన మత్తు పదార్థం కూడా కలిగి ఉంటుంది) అమ్మకానికి సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళపై నిఘా పెట్టిన పోలీసులు ఆమె ద్విచక్ర వాహనంపై కోడైన్ ఫాస్ఫేట్ సిరప్ బాటిళ్లను తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. ఆమెను నల్ల రజనీగా గుర్తించారు. డ్రగ్స్ కు సంబంధించిన లైసెన్స్ లేదా మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఆమె వద్ద లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు.
ఆ మహిళను విచారించగా..
హైదరాబాద్ విద్యానగర్ (Vidyanagar) లోని జెనరిక్ వరల్డ్ మెడికల్ షాప్ నుంచి ఈ మందును కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఈనేపథ్యంలో అధికారులు ఆ ఫార్మసీలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. మందుల దుకాణం నిర్వాహకుడు ప్రిస్క్రిప్షన్, బిల్లు లేకుండా కోడైన్ సిరప్ బాటిళ్లను విక్రయించాడు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కోడైన్ ఆధారిత దగ్గు సిరప్‌ల అమ్మకం, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, నిబంధనల ప్రకారం తప్పనిసరి అమ్మకాల రికార్డులను నిర్వహించడంలో వైఫల్యం చెందినందుకు గాను ఆ షాపును సీజ్ చేశారు. తదుపరి దర్యాప్తులో ఈ సిరప్‌లను హిమాలయ ఫార్మా (Himalaya Pharma) నుంచి సేకరించినట్లు తెలుసుకుని, ఓల్డ్ బోయినపల్లిలో ఉన్న ఆ దుకాణాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. 80 బాటిళ్ల కోడైన్ దగ్గు సిరప్‌లకు స్వాధీనం చేసుకుని, దుకాణ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. నిందితులపై ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్లో NDPS చట్టంలోని సెక్షన్ 8(c) r/w సెక్షన్ 20(b) కింద COR నంబర్ 32/2025 మేరకు A1గా నల్ల రజిని, A2గా అన్మోల్ కుమార్ సింఘాల్, A3గా దినేష్ కుమార్ గోయల్ పై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ . జీవన్ కిరణ్, ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ బాల రాజు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రవి చల్లా, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు డి. సరిత, డాక్టర్ కె. ప్రభాకర్, బి. గోవింద్ సింగ్, పి. రేణుక, ఇ. తిరుపతి, ఇ. నరేష్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………
