
– పెరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ కేసులు
– వారం రోజుల్లోనే 527 మందిపై…
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా చాలా మంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో నమోదైన కేసులే అందుకు నిదర్శనం. తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతుండడంతో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ దృష్టి సారించారు. వారం రోజుల్లో తాజాగా 527 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని ఆదివారం ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న 16 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని వెల్లడించారు. అత్యధికంగా కెపీహెచ్బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 64 కేసులు నమోదు కాగా, మియాపూర్, శంషాబాద్లో 50, చేవెళ్ల 40, గచ్చిబౌలిలో 39 , రాయదుర్గం 34 కేసుల చొప్పున మొత్తం 527 మందిపై డ్రంకెన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 404 మంది ద్విచక్ర వాహన దారులు, త్రీవీలర్ వాహనదారులు 24, 4 చక్రాల వాహనదారులు 93, 6 భారీ వాహనాల డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లు పరీక్షల్లో గుర్తించామని తెలిపారు. మద్యం సేవించిన డ్రైవింగ్ చేసిన వారిపై భారతీయ న్యాయ సంహిత-2023 సెక్షన్ 105 ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపడం ప్రమాదకరమని, తనిఖీల్లో పట్టుబడితే కోర్టు 10 ఏళ్ల లోపు జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
……………………………………..