
* కలకలం రేపుతున్న వరుస ప్రమాదాలు
* రెండు రోజుల్లో 8 మంది దుర్మరణం
* ఎవరిదీ పాపం..
* అధికారులదా.. నిర్వాహకులదా?
* విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అంటున్న బాధితులు
* రానున్న గణపతి వేడుకల్లో అప్రమత్తం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఎంతో ఆనందంగా మొదలవుతున్న వేడుకలు కొన్నిసార్లు విషాదంతో ముగుస్తున్నాయి. ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కొన్ని కుటుంబాలకు తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నాయి. రెండు రోజుల్లో నగరంలో చోటుచేసుకున్న మూడు విషాద ఘటనలలో ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. యువకులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. అన్ని ఘటనల్లోనూ వేలాడుతున్న విద్యుత్ తీగల ప్రమాదాలకు కారణమని బాధితులు ఆరోపిస్తుంటే, ప్రైవేటు కేబుళ్లు కొన్ని ఘటనల్లో కిందపడిపోవడమే కారణమని అధికారులు పేర్కొంటున్నారు.
వేడుక.. అంతలోనే విషాదం
ఉప్పల్ రామంతాపూర్ గోకుల్ నగర్ లో ఆదివారం కృష్ణాష్టమి సందర్భంగా రోజంతా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువకులు…రాత్రి రథంపై ఊరేగింపు నిర్వహించారు. సందడిగా కొనసాగిన శోభాయాత్రలో పెద్దసంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. అయితే యాత్ర చివరిలో విద్యుత్ తీగలకు నిర్లక్ష్యంగా తగిలించి ఉన్న కొక్కెం లాంటి మరో తీగ రథానికి తగలడంతో రథమంతా విద్యుత్ ప్రకంపనలు వ్యాపించాయి. రథాన్ని లాగుతున్నవారిలో చాలా మంది చెల్లాచెదురయ్యారు. కరెంట్ షాక్‌కు ఎగిరిపడ్డారు. వారిలో ఐదుగురు మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన ఎన్నోకుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో కేబుల్ వైరుకు ఉన్న ఇనుప తురుము, విద్యుత్ వైరు కు తాకడంతో విద్యుదాఘాతం జరిగి ఐదుగురు మృతి చెందారు. బాధితులకు రూ.5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
మర్నాడే మరోఘటన
తీవ్ర విషాదం నింపిన గోకుల్ నగర్ ఘటన మరువక ముందే.. మర్నాడే సోమవారం మరో ఘటనలు కలకలం రేపాయి. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో బండ్లగూడలో వినాయక విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్ వరకు గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్ పై తరలిస్తుండగా బండ్లగూడ వద్ద ట్రాక్టర్‌కు వేలాడుతున్నట్లుగా ఉన్న కరెంటు తీగలు తగిలి విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పైన కూర్చున్న ఇద్దరు యువకులు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను వికాస్, ధోనీలుగా అధిరారులు గుర్తించారు. ప్రమాదానికి కారణం విద్యుత్‌షాక్ కాదని, ఆ ప్రాంతంలో తీగలే లేవని అధికారులు పేర్కొంటున్నారు. ఎత్తులో ఉన్న విగ్రహంపై నుంచి కిందపడడం వల్లే చనిపోయారని అధికారులు అంటున్నారు. నిజానిజాలపై విచారణ జరుగుతోంది.
…………………………………..