
* విద్యతో పాటు సేవాభావం కలిగి ఉండాలి
* మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, ములుగు: ఉన్నత చదువుతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి సీతక్క అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ప్రకటించిన సందర్భంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని బుదవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అధ్యక్షతన నిర్వహించగా మంత్రి పాల్గొని విద్యార్దులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నత చదువులు చదవడం గొప్పకాదని, ఉన్నత చదువులు చదివిన వారు సేవాభావం కలిగి ఉండి సేవ చేసినప్పుడే వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందన్నారు. జిల్లాలోని విద్యార్థులు ఇంటర్లో మొదటి స్థానంలో నిలవడం ఆశించదగ్గ విషయమని, ఎంత నేర్చుకున్నామనేది ముఖ్యం కాదని నేర్చుకునే విషయాలు అనేకంగా ఉంటాయని అన్నారు. ఎవరైనా సముద్రాన్ని దాటగలరు కానీ జ్ఞానం ఎంత నేర్చుకున్న సరిపోదని అన్నారు. పోటీ పరీక్షల్లో నెగ్గడానికి జ్ఞానం పెంపొందించుకోవాలని, ఉన్నత చదువులు చదివిన వారు సేవ భావం లేనప్పుడు వారి చదువుకు గుర్తింపు ఉండదని అభిప్రాయపడ్డారు. ఉన్నత చదువులు చదివిన వారు మారుమూల గ్రామాలలోని ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు రావాలని, తాను సైతం భీకరమైన కరోనా సమయంలో ఏజెన్సీ గ్రామాలలో పలు కార్యక్రమాలు నిర్వహించడంతోనే తనకు గుర్తింపు లభించిందని వివరించారు. పిల్లలను పెద్దలను గౌరవించడం నేర్చుకోవడంతో పాటు సమాజ సేవ బాధ్యతలను నేర్చుకోవాలని, హాయ్ అనే పలకరింపు పదం మన సంస్కారం కాదని, నమస్కారం అని తెలిపారు. ములుగు జిల్లా విద్యార్థులలో పాటు తాను బాధ్యతలు వహిస్తున్న అసిఫాబాద్ జిల్లా విద్యార్థులు రెండవ స్థానంలో ఉండడం తనకు గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి రాష్ట్రంలో దేశంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, ములుగు జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలపడానికి కలెక్టర్, విద్యాశాఖ అధికారులు చొరవ చూపడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేయడంతో పాటు సన్మాన కార్యక్రమాన్ని, పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా అవార్డులు ఇప్పిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరు క్రమ శిక్షణతో ఎదుగుతూ సమాజ స్థితిగతులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
………………………………………….