
* ములుగు కలెక్టర్ దివాకర టి.ఎస్
ఆకేరున్యూస్, ములుగు: ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. సోమవారం గోవిందరావుపేట మండలం చల్వాయి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో విద్య బోధన ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కంప్యూటర్ లో చేస్తున్న తెలుగు, ఆంగ్లానికి సంబంధించిన ప్రమాణాలను పరిశీలించారు. గణితంలో సంఖ్యా భావనలు కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగాహారాలు, తెలుగులో విద్యార్థులు చేస్తున్న ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా 05 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ సహకారంతో వర్చువల్ రియాల్టీ విధానంలో పాఠాలు చెప్పేలా ప్రారంభించుకున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 3 నుండి 5 తరగతి విద్యార్థులకు కనీస విద్య ప్రమాణాలు, అభ్యాసన సామర్థ్యాలను పెంచే లక్ష్యంగా ఏఐ ద్వారా బోధిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే ఆరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా కార్యక్రమాన్ని ప్రారంభించగా అక్కడ మంచి ఫలితాలు ఇచ్చినందున రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పాటు ములుగు జిల్లాలో కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
పదవ తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్టి…
పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను పరిశీలించి ఆయన విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలు అంటే భయం వీడి పట్టుదలతో చదవి మెరుగైన ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రులకు, తమ ఊరికి, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చనీ తద్వారా లక్ష్యం మేరకు ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థుల స్టడీ అవర్స్ తీరును గమనించి ఉపాధ్యాయులను అభినందించారు. పరీక్షల సమయంలో మానసిక ఆందోళన పడవద్దని పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాయాలని లక్ష్యంతో చదివి తల్లిదండ్రుల కలల సహకారాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలెక్టర్ ఇస్తా గోష్టిగా మాట్లాడారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి తెలుసుకొని వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఇతర వసతులను పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాలలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. అనంతరం జెడ్ పి హెచ్ ఎస్, కె జి వి బి స్కూలు విద్యార్థిని విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ చేసి కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు కంటి లోపం లేకుండా ఉండాలంటే సమీకృత ఆహారం తీసుకోవాలని ఎక్కువగా ఫ్రూట్స్ క్యారెట్స్ తీసుకొని ఆరోగ్యం జాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రతి కాంపిటీషన్లో సులభంగా విజయం సాధించవచ్చునని తెలిపారు.
………………………………………………………….