
* 8.15 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయో తెలియడం లేదు
* నెలకు రూ.22వేల కోట్లు వస్తే తప్ప కనీస అవసరాలు తీరవు
* ఆర్థికంగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే.. కొత్త కొత్త డిమాండ్లు ఎలా వస్తాయ్
* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేసీఆర్ రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే.. అది మూడేళ్లకే కూలిపోయిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) విమర్శించారు. సర్పంచ్లకు గత ప్రభుత్వమే బకాయిలు పెట్టి పోయిందన్నారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా అప్పులు తెచ్చారని అన్నారు. కేసీఆర్ రూ. 8.15 లక్షల కోట్లు అప్పులు చేసి పదవి దిగి వెళ్లిపోయారని, ఆ లక్షల కోట్లు ఎక్కడికిపోయాయో తెలియడం లేదని ఆరోపించారు. కేసీఆర్ (KCR) చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే 1.58 లక్షల కోట్లు అప్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆర్థిక నేరగాళ్లు ఆర్థిక ఉగ్రవాదం చేసిన వెళ్లారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ధర్నాచౌక్లో నిరసన తెలిపే హక్కు లేకుండా దాన్ని మూసివేశారని అన్నారు. మిగులు రాష్ట్రం తెలంగాణ.. 8.15 లక్షల కోట్ల అప్పుల్లోకి ఎందుకు వెళ్లి పోయిందన్నారు. రాష్ట్రం అప్పుల పాలైతే కేసీఆర్ కుటుంబానికి పత్రికలు, చానళ్లు, ఫాహ్ హౌస్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వెయ్యి రూపాయల గ్యాస్ సిలిండర్ ను రూ.500కే ఇస్తున్నామన్నారు. తొలి ఏడాదిలోనే 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. ప్రస్తుతం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మన చదువులు లేవని, మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాలని నిర్ణయించామన్నారు. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకే స్కిల్స్ యూనివర్సిటీ (SKILL UNIVERSITY) ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తోందని, గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలకు రూ.6 వేల కోట్లు పోతున్నాయని అన్నారు. ప్రతి నెలా ఉద్యోగుల జీతభత్యాలకే రూ.6వేల కోట్లు పోతున్నాయని తెలిపారు. ప్రతి నెలా రూ.22వేల కోట్ల ఆదాయం వస్తే తప్ప కనీస అవసరాలు తీరవని వివరించారు. ఆర్థికంగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, కొత్త కొత్త డిమాండ్లు ఎలా వస్తాయని అన్నారు.
………………………………………