
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భూదాన్ భూముల వ్యవహారంలో పాతబస్తీకి చెందిన ప్రముఖ వ్యాపారి షర్ఫోన్తో పాటు మున్వర్‌ఖాన్, ఖదీర్ ఉన్నిస్ నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మహేశ్వరంలో వంద ఎకరాల భూమిని కబ్జా చేశారని వీరిపై ఆరోపణలు ఉండగా.. వారి ఇండ్లతో పాటు కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఇదే వ్యవహారంలో ఇప్పటికే మాజీ ఐఏఎస్ అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్‌లో ఫర్హోన్ ప్రముఖ వ్యాపారిగా కొనసాగుతున్నారు. ఆయనకు నగరంలో పలుచోట్ల భారీ షోరూమ్‌లు ఉన్నాయి. ఐఏఎస్ అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలోని 17వ సర్వే నంబర్లో 386 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలున్నాయి. ఇదే సర్వేనంబర్‌లోని ప్రైవేట్ భూమి 26 ఎకరాల్లో మెరుగు గోపాల్‌యాదవ్ వెంచర్ వేసి సీలింగ్ ల్యాండ్‌ను కూడా కలుపుకున్నాడు. అయితే తమ భూమిలో గోపాల్ యాదవ్ వెంచర్ వేశాడని పలువురు రైతులు ఆరోపిస్తూ అప్పటి కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నామని, తమ పేరిట పట్టాలున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై నిజనిజాలు రాబట్టేందుకు ఈడీ తనిఖీలు చేపట్టింది.
……………………………………………………