
* జూబ్లీహిల్స్‌లో మొదలైన ఎన్నికల వేడి
* గెలుపోటములపై పార్టీల సమాలోచనలు
* గత పోలింగ్ సరళి లెక్కలపై నేతల ఆరా
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచీ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. మరికొద్ది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుండడంతో అధికారులు ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2లోని షేక్‌పేట మండలంలో కార్యాలయాన్ని సిద్ధం చేశారు. దీంతో రాజకీయ పార్టీలు కూడా తమ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేశాయి. నామినేషన్లు, విత్‌డ్రాలు, అశావాహుల బుజ్జగింపులు, ఎన్నికల ప్రచారంపై చర్చలు మొదలుపెట్టాయి.
కులాల వారీగా సమీకరణాలు
నియోజకవర్గంలో ఇప్పటికే కులాల వారీగా సమీకరణలు మొదలయ్యాయి. కులం సంక్షేమ సమితిలను రాజకీయ నాయకులు కలిసి మద్దతు కోరుతున్నారు. కులాల వారీగా భారీగా ఓట్లను కొల్లగొడితే సంప్రదాయ ఓట్లతో గెలుపు సాద్యమవుతుందని పార్టీలు అంచనా వేస్తున్నాయు. ఇందుకోసం తెర వెనుక ఒప్పందాలకు సీనియర్లు తెర తీస్తున్నారు. ఇందుకోసం తాయిలాలు, హామీలు ఇచ్చేందుకు సిద్ధ్దమవుతున్నారు. ఓ పార్టీ నాయకుడు కుల సంఘం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఏకంగా వారి అసోసియేషన్ కోసం స్థలం కేటాయిస్తానని వాగ్దానం చేశాడు. మరో పార్టీ భారీగా ఆర్థిక వనరులు సమకూర్చి పెడతామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు నియోజకవర్గంలో పెద్ద కాలనీలు, అపార్ట్మెంట్లలో సంక్షేమ సమితి నాయకులను కలిసి తాయిలాలు ప్రకటిస్తున్నారు. సీసీ కెమెరాలు, క్రీడాసదుపాయాల కోసం హామీలు గుప్పిస్తున్నారు.
గతంలో ఏం జరిగింది
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కాంగ్రెస్ ఓ సారి టీడీపీ ఓ సారి, బీఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. కాగా, ఐదు సంవత్సరాల్లో పార్టీల బలాబలాల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. 2018లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని నాలుగు డివిజన్లలో బీఆర్ఎస్ విజయం సాధించగా, రెండింట ఎంఐఎం విజయం సాధించింది. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రె్‌సలోకి వెళ్లిపోయారు.
అప్పుడు కాంగ్రెస్‌కు 35.03 శాతమే
2023లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ 43.95 శాతం ఓట్లు సాధించగా, కాంగ్రెస్ 35.03 శాతం, బీజేపీ 14.12 శాతం ఓట్లు సాధించాయి. ఎనిమిది నెలల వ్యవధిలో జరిగిన పార్ల మెంట్ ఎన్నికల్లో గణాంకాలు మారాయి. కాంగ్రెస్ మొదటి స్థానం సాధించగా, బీజేపీ రెండు, బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకొని విశ్లేషకులు అంచనాలు రూపొందిస్తున్నారు. లెక్కలను బేరీజు వేసుకుని రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించిన అనంతరం రాజకీయ వేడి మరింత రాజుకోనుంది