
* హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నిక వినూత్నం.. ఆసక్తిదాయకం
* కొత్త తరహా అనుమానాలకు బీజం
* ఇదే అదునుగా బీజేపీ వ్యూహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎన్నిక ఏదైనా, ఎక్కడైనా.. ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. రెండు పార్టీలూ ఢీ అంటే ఢీ అంటూ ఎన్నికల సమరంలో తలపడతాయి. గెలుపు కోసం చెమటోడ్చుతాయి. కానీ, అటు అధికారంలో ఉన్న పార్టీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా పోటీ చేయకుండా పోటీలో లేకుండా ఎన్నికలు జరుగతాయా..?, తొలిసారిగా అదే జరుగుతోంది హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. దీంతో ఈ ఎన్నిక వినూత్నంగా, ఆసక్తిదాయకంగా మారింది.
బీజేపీకి కలిసొచ్చిన అంశం
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయంగా ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ ఎస్ పార్టీ దూరంగా ఉన్నాయి. బలం లేకపోయినా బీజేపీ బరిలో నిలిచి తెలంగాణలో బలపడేందుకు దీన్ని అవకాశంగా మలుచుకుంటోంది. గెలిచే అవకాశాలు ఉన్న ఎంఐఎంతో పోటీకి సిద్ధమైంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తాము రజకార్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, కాంగ్రెస్, బీఆర్ ఎస్ జీహుజూర్ అంటూ సలాములు కొడుతున్నారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఏజెంట్గా కాంగ్రెస్.. కనుసన్నల్లో బీఆర్ఎస్ ఉన్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎంఐఎంను ఎదుర్కొనేది తామే అంటూ ఎమ్మెల్సీ ఎన్నిక వేదికగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ రాష్ట్రంలోను, గ్రేటర్ హైదరాబాద్లోను బలపడేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బలం లేకున్నా బరిలో దిగిన బీజేపీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని పిలుపునిస్తోంది.
23న పోలింగ్
మరో మూడు రోజుల్లో (23వ తేదీన) పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 15న ఓట్ల లెక్కింపు జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 112 మందికి అర్హత ఉంది. వీరిలో ఎంఐఎంకు చెందిన వారే 50 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీలో 24 మంది, బీఆర్ఎస్లో 24, కాంగ్రెస్లో 14 మంది ఓటర్లున్నారు. ఓటర్ల సంఖ్యా పరంగా చూస్తే ఎంఐఎం గెలుపు పక్కా. అయిప్పటికీ బీజేపీ బరిలో నిలిచింది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మద్దతు కూడట్టుకుని గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంబర్పేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో టచ్లో ఉన్న బీజేపీ నేతలు, వారితో రహస్యంగా సమావేశమై సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు కాంగ్రెస్ కార్పొరేటర్లనూ కలుస్తున్నారు. దీంతో ఎవరు ఏ పార్టీతో కలుస్తారో, ఆ తర్వాత ఏ పార్టీలో ఉంటారో అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
బీజేపీ ఆశలపై కేటీఆర్ నీళ్లు
బీజేపీ ప్రయత్నాలు ఇలా ఉండగా.. తాజాగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఝలక్ ఇచ్చారు. బలం లేకే తాము ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదని, తమ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వదని ప్రకటించారు. అంతేకాదు.. ఓటింగ్ లో పాల్గొనకుండా పార్టీ తరఫున విప్ కూడా జారీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఓటింగ్లో పాల్గొనడంపై బీఆర్ ఎస్ కార్పొరేటర్లు సంశయంలో ఉన్నారు. పార్టీలు వేరైనా, ఎంఐఎంకు వ్యతిరేకంగా, స్థానిక రాజకీయ ప్రయోజనాలు కోసం కొందరు బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఇప్పటి వరకు ఆలోచనలో ఉండగా, తాజాగా అధినేత ప్రకటనతో అయోమయంలో పడ్డారు. విప్ జారీ చేస్తే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంఐఎం అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతునిచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ పార్టీ అధికారికంగా ప్రకటన చేయలేదు.
…………………………………………