
* ఆ పోస్టు అర్థం అదేనా?
* ట్రంప్ – మస్క్ మధ్య ముదిరిన వివాదం
* సోషల్‌మీడియా నుంచి బహిరంగంగా విమర్శలు
* ఢీ అంటే ఢీ అంటున్న అగ్రనేత.. అగ్ర పారిశ్రామికవేత్త
* మస్క్ కు రష్యా బంపర్ ఆఫర్
ఆకేరు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి :
అగ్రరాజ్యం అమెరికాలో అనూహ్య రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్, పారిశ్రామిక అధిపతి ఎలాన్ మస్క్ మధ్య ఓ బిల్లు విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటూ విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ సోషల్ మీడియా వేదికలుగానే కొనసాగిన వీరి విమర్శలు.. ఇప్పుడు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా ఎలాన్ మస్క్ చేసిన ఓ పోస్టు సంచలనంగా మారింది. అమెరికాలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకత ఉందనేది ఆ పోస్టు సారాంశం.
ఎక్కడి నుంచి ఎక్కడికో..
“దోస్త్ మేరా దోస్త్… తూహై మేరీ జాన్.. వాస్తవంరా దోస్త్… నువ్వే నా ప్రాణం..” అంటూ ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(DONAL TRUMP), స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (ELON MUSK) మధ్య బందం బీటలు వారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోను, నెగ్గిన తర్వాత కూడా వీరు ఒకరిపై మరొకరు ప్రేమను కురిపించుకునేవారు. ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. అతడిని అభిశంసించండి.. అని మస్క్ అంటే, మస్క్ వ్యాపార కార్యకపాలాలకు అమెరికా(AMERICA)లో కోతలు పెడతామనం ట్రంప్ హెచ్చరికలు జారీ స్థాయికి వివాదం చేరుకుంది. తొలుత సోషల్ మీడియా వేదికలుగా సాగిన వీరి విమర్శలు.. ఇప్పుడు నేరుగానే మొదలయ్యాయి. బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై ట్రంప్‌ను ఉద్దేశించి మస్క్ నేరుగానే విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ను అభిశంసించి, ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్‌నకు సంబంధాలున్నాయని, ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరుందని, అందుకే దానిని ఆయన బయటపెట్టడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
వివాదం మొదలైంది ఇలా..
డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వివాదం ట్రంప్ తెచ్చిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్(BIG BEAUTYFUL BILL” అనే భారీ బడ్జెట్ బిల్లుపై మస్క్ విమర్శలతో మొదలైంది. ఈ బిల్లు ఫెడరల్ ఖర్చులను భారీగా పెంచుతుందనీ, దీనివల్ల దేశ ఆర్థిక లోటు మరింత పెరుగుతుందని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన మస్క్‌పై తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్ ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు.. మస్క్‌ను తన ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తొలగించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న టాక్స్ క్రెడిట్‌ను రద్దు చేసినందుకు మస్క్ కోపంతో ఉన్నారని ఆరోపించారు. దీనికి మస్క్ తిరిగి స్పందిస్తూ, ఎన్నికల్లో ట్రంప్ తన సహాయం లేకుండా గెలవలేదనీ, జెఫ్రీ ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ పేరు ఉందని సంచలన ఆరోపణలు చేశారు. మస్క్ చర్యలకు ప్రతిగా ఎలాన్ దీటుగానే స్పందిస్తూ నాసాకు కీలకమైన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌ను స్పేస్ ఎక్స్ తొలగించడం ప్రారంభిస్తుందని హెచ్చరించారు.
ఒకరికి ఆర్థికంగా, మరొకరికి రాజకీయంగా నష్టం
అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేయాలంటే ఎలాన్ మస్క్‌కు ఇచ్చిన ప్రభుత్వ సబ్సిడీలను, కాంట్రాక్టులను రద్దు చేయడమే మార్గమని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనతో టెస్లా షేర్లు 14.3 శాతం నష్టపోయి, 150 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఒకే రోజు ఇంత గరిష్ట స్థాయిలో నష్టపోవడం టెస్లా చరిత్రలో ఇదే ప్రథమం. ఇది జరిగిన కొద్ది సేపటికి ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి అభిశంసించాలంటూ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడని విమర్శించారు. ట్రంప్, ఇతర రిపబ్లికన్లకు దాదాపు 300 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాం. ఇదా కృతజ్ఞతా?’ అని మస్క్ ప్రశ్నించారు. వీరి మధ్య వైరం ఒకరికి ఆర్థికంగా నష్టం కలిగిస్తే, మరొకరికి రాజకీయంగా నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ది అమెరికా పార్టీ.. మస్క్ సంచలన పోస్టు
ట్రంప్, మస్క్ వివాదం కొనసాగుతున్న క్రమంలో కొత్త పార్టీ తెరపైకి వస్తుందా అనే చర్చ మొదలైంది. గురువారం ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ఒక పోల్ నిర్వహించడే అందుకు కారణం. “ది అమెరికా పార్టీ(THE AMERICA PARTY)” అనే పేరుతో కొత్త పార్టీ స్థాపన కోసం పోల్ నిర్వహించారు ఎలాన్ మస్క్. ఇది రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మస్క్ సూచించారు. దీనిలో 80% మంది కొత్త రాజకీయ పార్టీ అవసరమని సమర్థించారు. ఈ పోల్‌ని ఈ ప్రతిపాదన అధికారిక రిపబ్లికన్ పార్టీలో ఆందోళనలను రేకెత్తించింది. ఆర్థికంగా అత్యంత బలవంతుడైన ఎలాన్ మస్క్ సారథ్యంలో కొత్త పార్టీ పురుడుపోసుకునే అవకాశాలూ లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అవకాశం ఎదురుచూస్తున్న రష్యా
డొనాల్డ్ ట్రంప్‌తో టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య వివాదాల క్రమంలో రష్యా సంచలన ప్రకటన చేసింది. అవసరమైతే ఎలాన్ మస్క్‌కు రాజకీయ ఆశ్రయం కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా (RUSSIA)సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రష్యా స్టేట్ డూమా (పార్లమెంట్ దిగువసభ) అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ఫస్ట్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఒకవేళ ఎలాన్ మస్క్‌కు అవసరమైతే, రష్యా కచ్చితంగా ఆశ్రయం కల్పిస్తుంది” అని ఆయన రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్‌తో వెల్లడించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌కు సన్నిహితంగా మెలిగిన మస్క్, ఇప్పుడు ఆయనతో తీవ్రంగా విభేదిస్తున్న నేపథ్యంలో రష్యా ఈ బంపర్ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. వారి వివాదం మున్ముందు ఎలా మారుతుందో శత్రువులైన మిత్రులు శత్రువులుగానే మిగిలిపోతారా? రాజీ పడతారా అనేది వేచి చూడాలి.
……………………………………………………………..