
* పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం
* ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ జి. సతీష్ రెడ్డి
* సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి డాక్టరేట్ ప్రదానం
ఆకేరు న్యూస్ హనుమకొండ: ఎస్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండ జిల్లా, హసన్‌పర్తి మండలం, అనంతసాగర్ గ్రామంలో వెలసిన ఈ విద్యాసంస్థ, జూన్ 6, 2025 న తన స్నాతకోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి SR యూనివర్సిటీ చాన్సలర్ శ్రీ ఏ. వరద రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా డా. జి. సతీష్ రెడ్డి హాజరయ్యారు. ఆయన ప్రస్తుతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఎయిరోస్పేస్ మరియు డిఫెన్స్ మానుఫాక్చరింగ్ హబ్ కి గౌరవ సలహాదారుగా ఉన్నారు (మంత్రివర్గ స్థాయి ర్యాంకు), అలాగే ఎయిరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా ఉన్నారు. అంతకుముందు ఆయన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి విభాగం కార్యదర్శిగా, DRDO చైర్మన్‌గా మరియు రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారుగా సేవలు అందించారు. పద్మశ్రీ ఎం.ఎం. కీరవాణి కి సినీ పరిశ్రమలో ఆయన చేసిన విశేష సేవల్ని గుర్తించి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డా. జి. సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ మూడవ స్నాతకోత్సవానికి హాజరవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఇది విద్యార్థుల జీవితాలలో ఒక మైలురాయి క్షణమన్నారు. ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, సమస్యల పరిష్కారకులుగా విద్యార్థులు ప్రపంచ సమస్యలను ఎదుర్కొనే శక్తిని సంతరించుకున్నారని అభినందించారు. యూనివర్సిటీలో ఉన్న శ్రేష్ఠమైన వసతులు మరియు అధ్యాపకుల సేవలను ఆయన ప్రశంసించారు.ఇండియాలో విద్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, ప్రతి సంవత్సరం 1.4 మిలియన్ల ఇంజినీర్లు తయారవుతారని, పబ్లికేషన్స్ మరియు PhDs పరంగా భారత్ మూడవ స్థానం లో ఉందని తెలిపారు. క్వాంటం టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు లాంటి రంగాల్లో భారత్ అగ్రగామిగా ఉందని చెప్పారు.భారత దేశ రక్షణ రంగం స్వదేశీ శక్తితో ముందుకు వెళ్తోందని, డ్రోన్స్, రాడార్లు, మిసైల్ వ్యవస్థల ద్వారా భారత్ శక్తిని ప్రపంచానికి చాటిందని తెలిపారు. గత ఏడాది ₹24,000 కోట్ల విలువైన రక్షణ సామాగ్రి ఎగుమతిచేసిందని, త్వరలో అది ₹50,000 కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమం రిజిస్ట్రార్ డా. ఆర్చన రెడ్డి ఆధ్వర్యంలో ప్రోసెషన్ తో ప్రారంభమై, దీపప్రజ్వలనతో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఎస్ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ తమ నివేదికలో యూనివర్సిటీకి చెందిన ఐదు స్కూళ్లలో అందించబడుతున్న విభిన్న ప్రోగ్రాములపై విశదంగా వివరించారు. ఈ కార్యక్రమం చివరగా ఛాన్సలర్ శ్రీ. ఏ. వరద రెడ్డి గారి ఉద్దేశ్య భాషణతో ముగిసింది.కార్యక్రమంలో ప్రొ-ఛాన్సలర్ శ్రీ. మధుకర్ రెడ్డి, ప్రొ-వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి. మహేష్, వివిధ స్కూల్ల డీన్లు, విభాగాధిపతులు ముఖ్య అతిథులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఇది యూనివర్సిటీ విద్యా నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.
………………………………………………..