
* 77ఏండ్ల స్వాతంత్య్రంలో పాలకుల పాలనలో మార్పులేదు
* అణగారిన వర్గాలకు చదువుకునే అవకాశం ఇస్తలేరు
* ఇఫ్లు విద్యార్థి సంఘ అద్యక్షులు పోరిక వికాస్
ఆకేరున్యూస్, వరంగల్: పట్టణాలకే పరిమితమైన నాణ్యమైన విద్య ప్రతి పల్లెకు చేరితేనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ అద్యక్షులు పోరిక వికాస్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘాల సమాఖ్య అద్యక్షులు తాడిశెట్టి క్రాంతికుమార్ అధ్యక్షతన శనివారం పోరిక వికాస్ కు జరిగిన సన్మాన కార్య్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలోని అసమానతలను తొలగించి సమసమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించే విద్య పట్టణాలకు పరిమితమై సంపన్నుల అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడేదిగా కొనసాగుతుందని ఆయన వాపోయారు. స్వాతంత్రం వచ్చి 77 ఏండ్లు దాటినా దేశాన్ని ఏలుతున్న పాలకుల పాలనలో మార్పు రాలేదని, తరతరాలుగా శ్రమలో, ఉత్పత్తిలో, చాకిరిలో కొనసాగుతున్న ప్రజలకు గొర్లు, బర్రెలు, చేపలు ఇస్తూ ఆ వృత్తిలో కొనసాగాలనే ఆలోచనలు చూస్తున్నారని అన్నారు. దేశంలో మెజార్టీ సంపదను చేజిక్కించుకున్న పాలక కులాలు అణగారిన వర్గాలకు అధికారం రానివ్వడం లేదని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న మాలాంటి తొలి తరం నాయకులందరూ ఐక్యంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరముందని అన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో రాణించాలన్న విద్య ప్రధానమైందని, అలాంటి విద్య దేశంలోని ప్రజలందరికీ సమానంగా అందడం లేదని, నేటికీ అత్యున్నత కేంద్ర విశ్వ విద్యాలయాల్లో అణగారిన వర్గాలను చదువనివ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భారతదేశంలోని ప్రతి గ్రామానికి నాణ్యమైన సమాన విద్య అందించే ఉద్యమంలో తాను ముందుంటానని అన్నారు. ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించి అట్టడుగు వర్గాల నుండి ఆసియా ఖండంలోనే పేరొందిన ఇఫ్లు విశ్వవిద్యాలయంలో ప్రవేశం సాధించడమే కాకుండా విద్యార్థి నాయకుడిగా పోరిక వికాస్ ఎన్నిక కావడం అణగారిన వర్గాలకు గర్వకారణమని అన్నారు. వేల ఏండ్లుగా వివక్షకు గురవుతున్న దేశ మూలవాసుల విముక్తి కోసం జరిగే పోరులో వికాస్ లాంటి నాయకులు ముందుండాలని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రజనీలత మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు అభివృద్ధి జరిగితే దేశానికి మేలు జరుగుతుందని అన్నారు. కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కొంగ వీరాస్వామి మాట్లాడుతూ పోరిక వికాస్ లాంటి విద్యార్థి, యువజన నాయకులు దేశంలో జరుగుతున్న వివక్షను అధ్యయనం చేయాలని, సామాజిక న్యాయం కోసం జరిగే సమరంలో విద్యార్థులు ముందుండాలని అన్నారు. న్యాయవాది ఎగ్గడి సుందర్ రామ్ మాట్లాడుతూ వికాస్ లాంటి తొలితరం నాయకులకు సామాజిక ఉద్యమకారులు అండగా నిలవాలని, విలువల సమాజ నిర్మాణం కోసం ప్రగతిశీల శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కెడిసి ఆంగ్ల అధ్యాపకులు శ్రీకాంత్, ఎల్ బి కళాశాల అధ్యాపకులు శాగంటి మంజుల, ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజ, వి.సి.కె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్, ట్రైబల్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు పోరిక ఉదయ్ సింగ్ నాయక్, కెయు అసిస్టెంట్ ప్రొఫెసర్ కొంగ వీరాస్వామి, వివిధ సంఘాల నాయకులు వల్లాల జగన్, సుందర్ రామ్, శివ నాస్తిక్, ధనలక్ష్మి, సద్గుణ, గారే జయరాజ్ తదితరులు పాల్గొని వికాస్ ను సత్కరించి పుస్తకాలను బహుకరించారు.
…………………………………………………