Eturunagaram Bus Depot Construction
* ఏటూరునాగారం బస్ డిపో పనులపై ఆరోపణలు..
* నిర్మాణ నాణ్యతపై తనిఖీలు చేపట్టాలని స్థానికుల డిమాండ్
ఆకేరు న్యూస్, ములుగు జిల్లా : ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది.
అయితే, ఇంత భారీ వ్యయంతో చేపడుతున్న నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో రూ.5.91 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తెలంగాణ ఆర్టీసీ నూతన బస్ డిపో పనులపై నాణ్యతకు సంబంధించి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
* నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు
ఏటూరునాగారంలో నిర్మాణంలో ఉన్న ఆర్టీసీ బస్ డిపోకు సంబంధించిన కాంక్రీట్ ఫుటింగ్స్, ప్లింత్ బీమ్స్, బేస్మెంట్ కాంక్రీట్ గోడలు, పిల్లర్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్లింత్ బీమ్స్ వద్ద జాయింట్లు కనిపించడం, నిర్మాణ పనులు పూర్తికాకముందే కొన్ని కాంక్రీట్ భాగాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, నిర్మాణంలో కనిపిస్తున్న లోపాలకు అసలు కారణమేంటి? పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయా? కాంట్రాక్టర్ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారా? అనే అంశాలు అధికారిక తనిఖీలు, సాంకేతిక పరీక్షల ద్వారా తేలాల్సి ఉంది.
* పర్యవేక్షణ ఎక్కడ?
రూ.5.91 కోట్ల ప్రజాధనంతో చేపడుతున్న ఈ నిర్మాణ పనులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. పనుల నాణ్యతను పరిశీలించడంతో పాటు ఉపయోగిస్తున్న నిర్మాణ సామగ్రి, కాంక్రీట్ నాణ్యత, నిర్మాణ ప్రమాణాలను సాంకేతిక నిపుణులతో తనిఖీ చేయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిధులతో చేపట్టే నిర్మాణాలు దీర్ఘకాలం మన్నికగా ఉండేలా చూడటం కీలకం. నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి సరిదిద్దాలి. లేదంటే భవిష్యత్తులో ప్రజాధనం వృథా కావడంతో పాటు నిర్మాణ మన్నికపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.
* నాణ్యతా పరీక్షలు నిర్వహించాలి
ఏటూరునాగారం ఆర్టీసీ బస్ డిపో నిర్మాణ పనులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన సాంకేతిక నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘
లోపాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన మరమ్మతులు లేదా పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థతో పాటు సంబంధిత పర్యవేక్షణ వ్యవస్థపైనా ఉంటుంది. మొత్తంగా.. ఏటూరునాగారంలో రూ.5.91 కోట్లతో నిర్మిస్తున్న ఆర్టీసీ బస్ డిపో పనుల నాణ్యతపై వ్యక్తమవుతున్న ఆరోపణలపై అధికారులు ఎలా స్పందిస్తారు? నిర్మాణ పనులపై సాంకేతిక తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెల్లడిస్తారా? అన్నది వేచి చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

