* ఆ ద్రోహుల వల్లే ఆయనను కోల్పోయాం
* 20 వేల మంది పోలీసులు బీఆర్ దాదా ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు
* ఆయనను సజీవంగా పట్టుకునే కాల్పి చంపారు
* తిండి, నీరు లేకపోయినా విప్లవకారులు ప్రతిఘటించారు..
* దండ కారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది విప్లకారుల మృతిపై దండ కారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట విడుదలైన ప్రకటన సంచలనంగా మారింది. మావోయిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శి నంబాల కేశరావు అలియాస్ బస్వరాజ్ అలియాస్ బీఆర్ దాదాను కోల్పోవడం వెనుక గల కారణాలను ఆ లేఖలో వెల్లడించారు. కొందరు విప్లవ ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసు బలగాలు ఆయనను చుట్టుముట్టాయని, సజీవంగానే పట్టుకుని కాల్చిచంపాయని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ ఆ లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు చనిపోయే ముందు కూడా నంబాల పార్టీ గురించే ఆలోచించి తమకు ఆదర్శనంగా నిలిచారని అన్నారు. ‘మా నాయకుడిని కాపాడుకోవడంలో మేం విఫలమయ్యాం. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్. 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసు. 20 వేల మంది పోలీసులు బీఆర్ దాదా ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆయనను పట్టుకుని సజీవంగానే కాల్చి చంపారు.’అని లేఖలో పేర్కొన్నారు.
చనిపోయింది 27 కాదు.. 28
పోలీసుల కాల్పుల్లో ఆ రోజున చనిపోయింది 27 మంది కాదని, నంబాల సహా 28 మంది నక్సలైట్లు చనిపోయారని ఆ లేఖలో వికల్ప్ వెల్లడించారు. ఒక మృతదేహాన్ని తాము వెంట తీసుకెళ్లామన్నారు. కేశవరావు టీమ్ లోని యూనిఫైడ్ కమాండో సభ్యుడు రికీతో సహా పలువురు ద్రోహం చేయడంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందన్నారు. . ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి.. 20వేల మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మా వైపు 35 మందే ఉన్నారు. అయినా విప్లవకారులు తీవ్రంగా ప్రతిఘటించారు. భద్రతా బలగాలకు హెలికాప్టర్ల నుంచి ఆహారం, నీళ్లు అందుతుంటే, మా వాళ్లు లోపల ఉండే 60 గంటల పాటు తిండి, నీరు లేకుండా పోరాడారని అన్నారు. 10 గంటల్లో ఐదు ఎన్కౌంటర్లు జరిగాయని, నంబాలను కాపాడుకునేందుకు 27 మంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు.
మే 21 చీకటి రోజు
మే 19 నుంచి 21 వరకు పోలీసులకు, తమకు మధ్య భీకర పోరు జరిగిందని వికల్ప్ ఆ లేఖలో తెలిపారు. నిజానికి ఈనెల 17నే బలగాలు మమ్మల్ని చుట్టుముట్టాయి. అదే రోజు పీపీసీ కమిటీ సభ్యుడొకరు తన సహచరితో పారిపోయారు. కుట్ర జరిగిందని, ఆ రోజే మాకు అర్థమైంది. వెంటనే శిబిరం మార్చాము. అయినా బలగాలు మా వరకూ వచ్చాయి. షెల్టర్ జోన్ కు తరలిపోవాలని నంబాలకు సూచించాం. నేను మహా అయితే మరో 2, 3 ఏళ్లు పోరాడగలను. నా గురించి ఆలోచించకండి. పార్టీని నిలబెట్టే యువ నాయకత్వం గురించి ఆలోచించండి అని నంబాల తెలిపారు. చివరి నిమిషంలోనూ ఆయన పార్టీ గురించి, ఉద్యమం గురించే ఆలోచించారు. అలాంటి నాయకుడిని కాపాడుకోవడంలో మేం విఫలమయ్యాం’అని లేఖలో పేర్కొన్నారు.
చర్చలకు కేంద్రం ఎందుకు సిద్ధంగా లేదో ప్రజలు గ్రహించాలి
‘మావోయిస్టులు 60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్భంధించాయి. కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. మేం ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి కాల్పులు జరపలేదు. పాక్తో కాల్పుల విరమణ జరిపిన కేంద్ర ప్రభుత్వం.. మాతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదు. ఆపరేషన్ కగార్ వెనుక గల అసలు లక్ష్యాన్ని ప్రజలు గ్రహించాలలి. దేశం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న మాకు మద్దతు ఇవ్వాలి’ అని స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ లేఖలో వెల్లడించారు.
………………………………………………
