
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు:ఈనెల 17 నుండి వచ్చే నెల 16 వరకు పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సూచించారు. కేంద్ర సమాచార శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో బుదవారం స్థానిక గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌కు, పోషణ మాసోత్సవాల ప్రారంభోత్సవం కు ముఖ్య అతిథిగా విచ్చేసి మంత్రి ప్రారబించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ నెలరోజుల పాటు జిల్లాలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ పోషకాహారం ప్రాధాన్యతను వివరించాలని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలు తీసుకోవలసిన ఆహారం, పోషణ పర్యవేక్షణపై గ్రామస్థాయిలో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు తూచడం, తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పోషకాహారం ప్రాధాన్యత వివరించడం, కిశోర బాలికలకు వైద్య పరీక్షలు వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తల్లిపాల ప్రాధాన్యత, కిచెన్ గార్డెన్ ఏర్పాటు, పరిశుభ్రత పాటించడం, పోషకాహారాల ప్రదర్శన ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని తెలిపారు. విద్య, వైద్య, పంచాయతీరాజ్, డిఆర్డీఓ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిశు, మహిళా సంక్షేమానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆంగ్ల మాద్యమంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహాణ, పిల్లలకు అందించే పోషకాహారంలో కాలమాణ పరిస్థితులకు తగినట్లు మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఉత్తమమైన ఆహారం ఆవశ్యకత గురించి తెలియజేసేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ ను అభినందించారు. అనంతరం పోషణ మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశారు. పోషకాహరంపై ఏర్పాటు స్టాల్స్‌ను సందర్శించారు. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ ప్రసంగిస్తూ, వెనుకబడిన ములుగు జిల్లాలో పోషకాహరంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర సమాచార శాఖ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శకులు వీక్షించారు. సెల్ఫీ బూత్‌లో ఫోటోలు దిగడంతో పాటుగా 360 డిగ్రీ కెమెరాతో ఫోటోలో తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాణోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, పీడీ డీఆర్డీఏ శ్రీనివాస్ రావు, జిల్లా సంక్షేమాధికారి తుల రవి, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, డీపీఆర్ఓ రఫీక్, సీడీపీఓ శిరీష, వివిధ విభాగాల జిల్లా అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
…………………………………………………….