* శ్రీనగర్‌లో అరెస్టు చేసిన ఎన్ఐ ఏ అధికారులు
* పటియాలా కోర్టు అనుమతితో కస్టడీకి
ఆకేరు న్యూస్, డెస్క్ : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఉగ్రదాడిలో ఈ నిందితులు కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. నలుగురు కీలక నిందితులను తాజాగా ఎన్ఐ ఏ అధికారులు అరెస్టు చేశారు. డా.ముజమ్మిల్ షకీల్ (పుల్వామా), డా. అదీల్ అహ్మద్ (అనంత్ నాగ్), డా.షాహీన్ సయూద్ (లఖ్‌నవూ), ముఫ్తీ ఇర్ఫాన్ (షోపియాన్)లను శ్రీనగర్‌లో అరెస్ట్ చేశారు. పటియాలా హౌస్ కోర్టు ఆదేశాల మేరకు ఆ నలుగురు నిందితులను కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే కారు బాంబు పేలుడులో సహకుట్రదారు జసీర్ బిలాల్‌ను 10 రోజుల కస్టడీకి అనుమతించింది. అలాగే ఉగ్ర కుట్ర కేసులో అరెస్టైన నిందితుల సమాచారం ఆధారంగా శ్రీనగర్ పోలీసులు ఇప్పటికే జాసిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితుడు అమీర్ రషీద్ అలీని ఎన్ ఐఏ అధికారులు 10 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇతడు ప్రధాన నిందితుడు నబీకి ఆశ్రయం కల్పించడంతో పాటు, లాజిస్టిక్ సపోర్ట్ అందించినట్టు కోర్టుకు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
…………………………………………………………………..
