
* రోడ్డు పైనే వంటా వార్పు
ఆకేరు న్యూస్ , వరంగల్ : ఇంతకాలం వర్షాల కోసం ఎదురు చూసిన రైతాంగానికి ఇప్పడు యూరియా కోసం పాట్లు పడుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. రోడ్లపై నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అంతే కాగా వంటావార్పు కార్యక్రమాలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వర్షాలు పడక ఆందోళన చెందిన రైతాంగానికి గత పక్షం రోజులుగా
ఎడతెరపి లేని వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నాయి. దీంతో రైతులు పంటల సేద్యానికి సిద్ధమయ్యారు. ఖరీఫ్ సీజన్లో కొంత మంది ఇంతకుముందే పత్తి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్నసాగు చేస్తున్నారు. ఇప్పడు వరి సాగు చేస్తున్నారు. పంటలకు తెగుళ్లు ఆశించకుండా ఉపయోగించే యూరియా కోసం రైతాంగం అరిగోస పడుతున్నారు. నిద్రాహారాలు మాని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారు జామునే యూరియా పంపిణీ కేంద్రాలకు చేరుకుని యూరియా టోకెన్ల కోసం పాట్లు పడుతున్నారు. క్యూలైన్లో నిలుచున్న రైతులందరికీ సరిపడా యూరియా అందడంలేదు. ఒక్కో రోజు రెండు బస్తాలు, ఒక్కో రోజు ఒక బస్తాను పంపిణీ చేస్తున్నారు. దీంతో తాము సాగుచేసే పంటకు సరిపడా యూరియా అందడంలేదని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా ఎప్పడు వస్తుందో.. తమ తిప్పలు ఎప్పడు తప్పతాయో అంటూ దీనంగా యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు యూరియా కోసం వంటావార్పు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామ రైతు వేదిక వద్ద యూరియా కోసం మహిళా రైతులు ఆందోళన చేశారు. జాతీయ రహదారిపై వంటా వార్పు చేస్తూ.. యూరియా కోసం ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు మహిళా రైతులను అడ్డుకుని సర్ధిచెప్పి ఆందోళనను విరమింపజేశారు.
………………………………………….