* ఆదిలాబాద్ జిల్లా దహిగూడలో ఘటన
ఆకేరు న్యూస్ డెస్క్: ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేసుకోవడానికి భయపడి ఓ గర్భిణి పత్తిచేనులో దాక్కున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా దహిగూడకు చెందిన ఆత్రం భీంబాయి అనే ఆదివాసీ మహిళ ప్రభుత్వ ఆస్పత్రి రిమ్స్ లో ప్రసవించడానికి భయపడి పత్తి చేనులో దాక్కుంది. వైద్య సిబ్బంది మహిళను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడానికి వస్తున్నారని తెలిసి పత్తిచేనులోకి పరుగులు తీసింది. వైద్య సిబ్బంది ఇంటి వద్దకు చేరుకోగానే మహిళ ఇంటి వద్ద లేదని కుటుంబసభ్యులు తెలిపారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి ఇంట్లో కన్పించకపోవడంతో కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది కంగారు పడి ఊరంతా వెదికారు. చివరకు ఊరి చివర పత్తి చేనులో తన కుమారుడితో కన్పించింది. తమతోపాటు ఆసుపత్రికి రావాలని వైద్య సిబ్బంది కోరగా నిరాకరించింది. ఆ తర్వాత వైద్య సిబ్బంది సదరు మహిళకు ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ నిర్వహించి చివరికి మహిళను ఆస్పత్రికి తరలించారు.రిమ్స్ లో గంటలోపే ఆరోగ్యవంతమైన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
మూఢనమ్మకాలతోనే ఇదంతా..
ఈ ఘనటపై జిల్లా డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ ను వివరణ కోరగా ఆయన వివరణ ఇచ్చారు.ఎంత మెరుగైన వైద్యసేవలు అందించినా ఆదీవాసీల్లో మూఢనమ్మకాలు పోవడంలేదన్నారు. దేవతలు మూఢ నమ్మకాల మీద ఉన్న నమ్మకం వైద్యుల మీద ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోషక ఆహార లోపం,రక్త హీనత మొదలైన లోపాలతో ఉంటారని అయినా వైద్యం చేయించుకోవడానికి నిరాకరిస్తారని తెలిపారు.
సిజరిన్ చేస్తారనే భయంతోనే…
నొప్పులు రాకుంటే సిజరిన్ చేస్తారనే భయంతోనే ఆత్రం భీం భాయి ప్రసవం చేయించుకోవడానికి భయపడిందని స్థానిక వైద్యుడు సర్ఫరాజ్ తెలిపారు. గతంలో స్కానింగ్ చేశాం కాబట్టి ఆమె ప్రసవం తేదీ సెప్టెంబర్ 11అని అందుకే ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ్రగామానికి వచ్చామని తెలిపారు. నొప్పులు రాకపోతే డాక్టర్లు సిజరిన్ చేస్తారనే మహిళ భయపడి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు.వెళ్లే సరికి ఇంట్లో లేకుండా పారి పోయిందని దాదాపు ఓ గంట సేపు వెదకగా చివరికి పత్తి చేనులోకన్పించిందని తెలిపారు. ఆస్పత్రికి రానని నిరాకరించడంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి గ్రామస్తుల సహాయంతో ఒప్పించి చివరికి ఆస్పత్రికి రావడానికి ఒప్పుకుందన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన గంటలోనే మహిళ నార్మల్ డెలివరీ అయిందని మగ బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ సర్ఫరాజ్ తెలిపారు.
………………………………………
