
ఆకేరున్యూస్, అమరావతి : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఏపీ ఫైబర్‌నెట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ హయాంలో రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు లబ్ధిపొందారంటూ ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ సంస్థ శనివారం మధ్యాహం నోటీసులు జారీ చేసింది. ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ, సహ పలువురికి నోటీసులు అందజేసింది. ఫైబర్ నెట్ నుంచి ఒక వ్యక్తి సినిమా చూస్తే కేవలం వంద రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అప్పటి వైసీపీ ప్రభుత్వం రూ.11 వేలు చొప్పున ఇవ్వడంపై నోటీసులు జారీ చేసింది. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్‌నెట్ నుంచి కోటీ 15 లక్షల రూపాయల మేర అనుచితంగా లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఫైబర్‌నెట్ చైర్మన్ జి.వి.రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్‌నెట్ ఎండీ సహా ఐదుగురికి నోటీసులిచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యూహం సినిమాకు వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా రామ్‌గోపాల్‌వర్మతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయని ఈ లెక్కన ఒక్కో వ్యూస్‌కు రూ. 11 వేల చొప్పున నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని వివరించారు. రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చంద్రబాబుతో పాటు మరికొందరి రాజకీయ నాయకుల పాత్రలు ఉన్నాయి.
……………………………………