* జీఎస్టీని సరళతరం చేసిన కేంద్ర ప్రభుత్వం
* కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
* పద్రాగస్టు రోజున దేశ ప్రజలకు హామీ ఇచ్చిన ప్రధాని
* వినియోగ వస్తువులపై తగ్గనున్న భారం
* ఇప్పటికే ఆలస్యం అయిందంటున్న ప్రతిపక్షాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : 2025 ఆగస్టు 15 న ఎర్రకోట పై నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ త్వరలోనే దేశ ప్రజలకు తీపి కబురు చెప్తానని,దీపావళి పండగ ముందే పండగ చేసుకుంటారని ఓ ప్రకటన చేశారు. ఈ నేపధ్యంలోనే దేశ వ్యాప్తంగా జీఎస్టీని సరళతరం చేయనున్నట్లు దేశ ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇప్పుడున్న 4 స్లాబుల్లో ఇక 2 స్లాబులే మిగిలి ఉండనున్నాయి. ఈ నెల 22 నుంచి మారిన స్లాబుల ప్రకారం ఆయా వస్తూత్పత్తులపై నూతన పన్ను రేట్లు వర్తించనున్నాయని జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీఎస్టీ అంశం తెరమీదకు వచ్చింది. 2016 నవంబర్ లో మోదీ ప్రభుత్వం ఉన్నట్టుండి పెద్ద నోట్లను రద్దు చేసింది. పెద్ద నోట్లను రదు చేసిన తరువాత జూలై 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని అమలులోకి తెచ్చింది.జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ తెలుగులో వస్తువుల మరియు సేవలపై పన్ను.ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా ఒక సేవను పొందినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వ్యవస్థ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా వస్తువు లేదా సేవలపై ఈ పన్ను రేటు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అంటే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వినియోగదారుడు ఆ వస్తువులు లేదా సేవలపై ఒకే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
22 నుంచి కొత్త విధానం …
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై తీసుకున్న నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి దేశ వ్యాప్తంగా అమలు కానున్నది.ఈ నెల 22 నుంచి మారిన స్లాబుల ప్రకారం ఆయా వస్తూత్పత్తులపై నూతన పన్ను రేట్లు వర్తించనున్నాయని బుధవారం ఇక్కడ జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
తగ్గనున్న ధరలు…
నూతన జీఎస్టీ విధానంతో వినియోగదారుల మీద భారం తగ్గనుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమాల ప్రీమియంలు తగ్గనున్నాయి. పేద మధ్య తరగతి వారు ఉపయోగించే వస్తువులపై కాస్త ఊరట లభించనుంది. 1200సీసీ లోపున్న పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లు, 1500 సీసీ లోపున్న డీజిల్ కార్లు, 350సీసీ లోపున్న ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, అంబూలెన్స్‌లు, ఏసీ, టీవీలు, డిష్ వాషర్లు, వాషింగ్ మెషీన్లు, సిమెంట్, ఆటో విడిభాగాలపై జీఎస్టీ భారం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్నారు. 20 లీటర్ ప్యాకేజ్డ్ వాటర్, హెయిర్ ఆయిల్, బిస్కట్లు, ఐస్‌క్రీములు,టూత్‌పేస్ట్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, సబ్బులు, సైకిళ్లు, హస్తకళలు, మార్బుల్స్, గ్రానైట్ బ్లాక్స్, జామ్, కోకోనట్ వాటర్, సాస్, పాస్తా,ఇన్స్టంట్ న్యూడుల్స్, చాక్లెట్లు, హోటల్ గది, వెదురు ఫర్నీచర్ మొదలైనవి 12 లేదా18 శాతం స్లాబ్ నుంచి 5 శాతం స్లాబులోకి రానున్నాయి.
సిగరెట్లపై యధావిధిగా…
పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, 350సీసీ మించిన మోటార్ సైకిళ్లు, 1200సీసీ మించిన పెట్రోల్ కార్లు, 1500సీసీ మించిన డీజిల్ కార్లు కొన్ని రకాల శీతల పానీయాలు, వ్యక్తిగత విమానాలపై ప్రత్యేకంగా 40 శాతం జీఎస్టీ అమలులో ఉంటుంది.
విద్యార్థులకు వెసులబాటు…
జీఎస్టీలో విద్యపై వెసులుబాటు కల్పించారు. విద్యార్థుల తల్లిదండ్రలకు కాస్త రిలీఫ్ ను ఇచ్చారు.
మ్యాప్‌లు,చార్టులు మ్యాప్‌లు, చార్టులు, గ్లోబ్‌లు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, క్రేయాన్స్, ప్యాస్టెల్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, నోట్‌బుక్స్,ఎరేజర్లపై జీఎస్టీ ఎత్తివేశారు.
వ్యవసాయ పరికరాలు..
ట్రాక్టర్ టైర్లు విడిభాగాలపై 18 శాతం ఉన్న దానిని 5 శాతానికి తగ్గించారు. ట్రాక్టర్లు, స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
విద్యుత్ గృహోపకరణాలు
ఏసీలు, టీవీలు మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషీన్లపై జీఎస్ఠీ 28 శాతం నుంచి 18శాతానికి తగ్గించారు.
చాలా ఆలస్యం అయింది : ప్రతిపక్షాలు
జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్రంలో ప్రతిపక్షనేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ అమలు చేసిన మొదటి రోజు నుంచే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో చేసిన సంస్కరణలపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత స్పందించారు. ఏ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. GST రూపకల్పనలో చాలా లోపాలున్నాయని ప్రతిపక్షాలు చాలా సంవత్సరాలుగా హెచ్చరిస్తూ వచ్చాయని.. అయినా కేంద్రం పెడ చెవిన పెట్టిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడంలే కేంద్రం చాలా ఆలస్యం చేసిందని పేర్కొన్నారు. దేశంలో వృద్ధి మందగించడం, ప్రజల రుణభారం పెరిగి, పొదుపు తగ్గడం వంటి అంశాలు కూడా కేంద్ర చర్యలకు కారణమని చిదంబరం వ్యాఖ్యానించారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ అంశంపై స్పందించింది. జీఎస్టీ తో సామాన్యప్రజలు ఎంతో నష్టపోయారని పేర్కొంది. ప్రతిపక్షాల ఒత్తిడి మేరకే కేంద్రం ఇప్పటికి దిగి వచ్చిందని పేర్కొంది.
…………………………………
