* హమ్మయ్య.. ఎట్టకేలకు చిరుత చిక్కింది
* ఆపరేషన్ చిరుత సక్సెస్
* ఐదు రోజులుగా అధికారుల పడిగాపులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :ఆ చిరుత బోనులోకి వచ్చింది. మేకను తినేందుకు వచ్చి ఎట్టకేలకు చిక్కింది. 5 బోన్లు, 20కు పైగా ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేసి ఐదు రోజులుగా చిరుత కదలికలను గమనిస్తున్న అధికారుల నిరీక్షణ ఫలించింది. పలుమార్లు బోను వరకు వచ్చినట్లే వచ్చి.. వెనక్కిపోతున్న చిరుత గురువారం అర్ధరాత్రి బోనులోకి వచ్చింది. చిరుత చిక్కడంతో శంషాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
శంషాబాద్ నుంచి జూ పార్కుకు.. ఆపై…
కొద్ది రోజుల క్రితం ఎయిర్ పోర్టు రన్ వేపై చిరుత కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు ఎయిర్ పోర్టు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది చిరుత కోసం వేట మొదలుపెట్టారు. అనుమానిత చిరుత సంచార ప్రాంతాలను గుర్తించిన అధికారులు, ప్రత్యేకించి ఇరవై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐదు బోన్లను ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలను ఎరగా ఉంచారు. ఒకానొక దశలో చిరుత బోను వరకూ వచ్చి వెనకి వెళ్లిపోతుండటంతో చిరుత చిక్కలేదు. అయితే గురువారం అర్ధరాత్రి మాత్రం మేకను ఆహారంగా తినేందుకు వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ తెలిపారు. ఎయిర్పోర్ట్ నుంచి చిరుతను నెహ్రూ జూ పార్క్ తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు పర్యవేక్షణలో ఉంచుతామని డోబ్రియల్ తెలిపారు. తర్వాత అడవిలో విడిచి పెడతామని పేర్కొన్నారు. ఐదురోజులుగా చిరుతను బంధించడం కోసం శ్రమించిన రంగారెడ్డి జిల్లా డీఎఫ్వో సుధాకర్ రెడ్డి, ఎఫ్డీవో విజయనంద్లను ప్రత్యేకంగా అభినందించారు.
———————-