
నేటి నుంచే హోం ఓటింగ్
* ఓటర్ల ఇంటికే అధికారులు
* పకడ్బందీ ఏర్పాట్లు
* ఓటు హక్కు వినియోగించుకోనున్న 23,248 మంది
* పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా నేటి నుంచే..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పోలింగ్ మూడ్ మొదలైపోయింది. ఈ నెల 13న పోలింగ్ ఉండగా, నేటి నుంచి హోం హోటింగ్ మొదలైంది. ఐదో తేదీ వరకూ అవసరమైతే ఆరోతేదీ వరకు కూడా హోం ఓటింగ్ కొనసాగనుంది. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌ల వరకు రాలేని వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ అవకాశం కల్పించింది. 85 ఏళ్లు దాటిన వృద్ధులకు, దివ్యాంగులు, దీర్ఘకాలికవ్యాధిగ్రస్తులు, మంచానికే పరిమితమైన వాళ్ళు మానసిక వ్యాధులు ఉన్నవాళ్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెసులుబాటును కల్పించింది.
4.87 లక్షలకు 25 వేల మందే దరఖాస్తులు
తెలంగాణలో హోం ఓటింగ్ కు 4.87 లక్షల మంది ఓటర్లకు అర్హులు ఉన్నారు. కానీ 25 వేల మందే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రాష్ట్రవ్యాప్తంగా 23,248 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. వారందరూ ఈ మూడు రోజుల్లో హోం ఓటింగ్ లో పాల్గొననున్నారు. హోం ఓటింగ్‌కు 806 బృందాలు, 885 రూట్లుగా ఎన్నికల అధికారులు విభజించారు. ఒక్కో బృందంలో పోలింగ్ అధికారులతోపాటు వీడియో చిత్రీకరణ బృందం కూడా ఉంటుంది. హోంఓటింగ్ను ఈ నెల 6 కల్లా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
హోం ఓటింగ్ ప్రక్రియ ఇలా..
హోం ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇంటికి ఎన్నికల అధికారులు సిబ్బందితో కలిసి వెళ్లి వారి చేత రహస్యంగా ఓటు వేయిస్తారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓట్ వేసేటప్పుడు ఎలా అయితే రహస్య ఓటింగ్ ఉంటుందో ఇంటి నుంచే ఓటు వేసేటప్పుడు కూడా ఓటర్ ఎవరికి ఓటేస్తున్నారో ఎవరికీ తెలిసే అవకాశం లేకుండా అధికారులు అన్ని చర్యలూ తీసుకుంటారు. పోలీసుల సమక్షంలో ఎన్నికల సిబ్బందితో కూడిన టీంలు ఇళ్ల వద్దకు వెళ్లి ఓటు వేయిస్తారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇలా..
హైదరాబాద్ పార్లమెంట్లో 182 మంది, సికింద్రాబాద్ పరిధిలో 398 మంది 12డీ ఫారం ద్వారా హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేశారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో 129, సికింద్రాబాద్‌లో 385 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. కంటెన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 58 దరఖాస్తులు రాగా అన్నీ ఆమోదించారు. ప్రాంతాలవారీగా హోం ఓటింగ్ మ్యాపింగ్‌ను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు (ఏఆర్ఓ) రూపొందించారు. సికింద్రాబాద్‌లో 27 రూట్ల కోసం 27, హైదరాబాద్‌లో 24 రూట్ల కోసం 10 బృందాలు, కంటోన్మెంట్లో మూడు రూట్లకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. 3 నుంచి 5వ తేదీ వరకు హోం ఓటింగ్ కొనసాగనుంది. హోం ఓటింగ్ తో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఈరోజే ప్రారంభం కానుంది. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
————————-