*హైదరాబాద్ – అత్తాపూర్లో భారీ అగ్నిప్రమాదం
ఆకేరు న్యూస్,హైదరాబాద్:నగరంలోని అత్తాపూర్లో గల ఒక ప్రముఖ కార్ల షోరూమ్ సర్వీస్ సెంటర్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సర్వీస్ సెంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి.ప్రమాద సమయంలో సెంటర్లో సుమారు 50 కార్లు ఉండగా, అందులో పలు వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సెంటర్కు ఆనుకుని ఉన్న అపార్ట్మెంట్లోని 90 కుటుంబాలను పోలీసులు తక్షణమే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఈ ప్రమాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మేనేజ్మెంట్ అశ్రద్ధ వల్లే షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని కాలనీవాసులు ఆరోపిస్తుండగా, ఎవరో కావాలనే నిప్పు పెట్టారని షోరూమ్ యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
