* వరంగల్ లో వరద బీభత్సం
* నీట మునిగిన కాలనీలు
* రహదారుల్లో పోటెత్తిన వరద
* స్తంభించిన జనజీవనం
ఆకేరు న్యూస్, వరంగల్ : మొంథా తుఫాన్ వరంగల్ నగరాన్ని ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. మొత్తం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తింది. నగరం పరిధిలోని 30 కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. సాయిగణేశ్ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్యనగర్, సమ్మయ్య నగర్లో వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది. ఇంట్లో ఉన్న వృద్ధులు, చిన్న పిల్లల పరిస్థతి హృదయవిరారకంగా ఉంది. మరో వైపు భత్రకాళి చెరువుఉధృతికి పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి, పాలిటెక్నెకిక్ కళాశాల, ములుగు రోడ్డు,సంతోషమాత కాలనీ డీకే నగర్, ఎన్ ఎన్ నగర్ లు మొత్తం నీట మునిగాయి. హంటర్ రోడ్డుపై రవాణా బంద్ అయింది. వరద నీరు నడుం లోతు వరకు చేరడంతో పోలీసులు తాళ్ల సహాయంతో పట్టుకొని గమ్యస్థానాలకు చేర్పించారు. వరంగల్ నగరంతోపాటు హనుమకొండ, కాజీపేట పట్టణాలను ఇంకా వరద వీడలేదు. వరంగల్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వరంగల్ తూర్పులో అధికారులు ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని పడవల సహాయంతో పునరావాస శిబిరాలకు తరలించారు. నగరంలోని 12 పునరావాస కేంద్రాలకు 1200 మంది బాధితులను తరలించారు. వర్షాల దృష్ట్యా వరంగల్ బల్దియా కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 1980 ఏర్పాటు చేశారు. డీఆర్ఎఫ్, ఇంజినీరింగ్, శానిటరీ సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను నియమించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పాఠశాలల్లో ఎస్ఏ-1 పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు వరంగల్ డీఈవో వెల్లడించారు.
ఊరు చెరువు అయింది.. రోడ్లు కాలువలయ్యాయి
మొంథా తుఫాన్ వరంగల్ నగర ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది.
బుధవారం ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తం అయింది.
ఒక్క సారిగా నగరం మొత్తం జలదిగ్భంధం అయింది. వరంగల్ నగరం చుట్టూ వరద ఉధృతి
పెరగడంతో రోడ్ల మీది నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రాక పోకలు స్థంభించి
పోయాయి. నగరంలో లోపలి వాళ్ళు బయటకు, బయటి వాళ్ళు లోపలకు రాలేని పరిస్థితి
ఏర్పడింది. హనుమకొండలోని పలు కాలనీలు నీట మునిగాయి. హనుమకొండ చౌరస్తా- ఎన్ ఐటీ కళాశాల నుంచి వడ్డెపల్లి క్రాస్ రోడ్ వరకు రోడ్ పై నీటి ఉధృతి పెరిగింది. రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హనుమకొండలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తున్నది. వర్షపు నీటితో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.హంటర్‌రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ములుగు వెళ్లే రోడ్డులో నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. ఇక తిరుమల బార్ , అంబేద్కర్ భవన్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి ములుగు రోడ్ – పెద్ద మ్మ గడ్డ జంక్షన్ వద్ద ప్రవాహ ఉధృతి పెరగడంతో వాహనాలను దారి మళ్ళించారు. వరంగల్- కాజీపేట రైల్వే స్టేషన్లల్లో నీరు జోరుగా చేరడంతో పలు రైళ్ళను దక్షిణ మద్య రైల్వే రద్దు చేశారు. వరంగల్ , హనుమకొండ ఆర్టీసీ బస్ స్టేషన్లల్లో వర్షపు నీరు భారీగా చేరడంతో బస్సులను సైతం పరిమితంగా నడుపుతున్నారు. మోంథా తుఫాన్ వరంగల్ నగరం పై ఒక్కసారిగా విరుచుకుపడడంతో పలు కాలనీల్లోని ప్రజలు వరదలో చిక్కుకు పోయారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రజా ప్రతినిదులు , అధికారులు నగరంలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణిలతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్లు పర్యటించారు.సహాయక చర్యలను పర్యవేక్షించారు. నగరం పరిస్థితి ఇలా ఉంటే జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావం ఉంది. ఊళ్లలో
డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ
నగరంలోని పలు కాలనీలు పూర్తిగా జలమయం కావడంతో ఇళ్లలోకి నడుం లోతు వరకు నీరు వచ్చి చేరింది. జలదిగ్భంధంలో చిక్కకున్న ప్రజలకు అధికారులు డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలను అందిస్తున్నారు. అధికారులు బాధితులతో ఫోన్లలో మాట్లాడి కావాల్సిన సహాయం అందజేస్తున్నారు.
…………………………………………….
