
* నేతలకు దిశా నిర్దేశం చేస్తున్న కేసీఆర్
* పార్టీ కేడర్ తో కేటీఆర్ సమావేశాలు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్న నేపధ్యంలో బీఆర్ ఎస్ పార్టీ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు పోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేక పోయింది. ఎలాగైనా పార్టీకి పూర్వ వైభవం తేవాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. నిజానికి గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ పార్టీ వ్యవస్థాగత నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అసలు దృష్టే పెట్టలేదని చెప్పవచ్చు. తెలంగాణ ప్రజలు బీఆర్ ఎస్ ను కాదని ఏ పార్టీకి ఓటు వేయరు అనే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పోయారు.ఇదిలా ఉండగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీ గూటిలోకి చేరారు. అలాంటి నియోజకవర్గాలపై పార్టీ అగ్రనాయకత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించింది.దీంతో ఆ యా నియోజకవర్గాలకు చెందిన పార్టీ కేడర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఆదివారం.. అంటే ఆగస్టు 24వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కేడర్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జ్‌ను కేటీఆర్ ప్రకటించనున్నారు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అరికేపూడి గాంధీ.. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ నియోకవర్గాల కేడర్‌తో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి.. ఇన్ఛార్జ్లను నియమించాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆదేశించినట్లు ఓ చర్చ అయితే సాగుతోంది.
సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్..?
స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల కావచ్చు అనే చర్చ జరుగుతోంది.ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మూడు ప్రత్యామ్నాలను సూచించినట్లు తెలుస్తోంది.బిల్లుకు ఆర్డినెన్సుకు ఇప్పట్లో ఆమోదం లభించే అవకాశం లేనందున కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి ముందుకు వెళ్లడమే ఉత్తమమని రేవంత్ భావిస్తున్నారు.
…………………………………………………..