* వేములవాడలో కౌంటర్ వద్ద నిరీక్షణ
* టికెట్ల కుదింపుపై భక్తుల ఆగ్రహం
ఆకేరు న్యూస్, కరీంనగర్ : రాజన్న భక్తులు కష్టాలు పడుతున్నారు. వేములవాడ ఆలయంలో స్వామివారి నిత్య కల్యాణ టికెట్ల కోసం భక్తులు నానా అవస్థలకు గురవుతున్నారు. ఆలయ విస్తరణలో భాగంగా కళాభవన్‌ను కూల్చి వేశారు. కల్యాణాలను పార్వతీపురంలోని నిత్యాన్నదాన సత్రం పైభాగంలో నిర్వహిస్తున్నారు. స్థలం తక్కువగా ఉండటంతో ఇక్కడ 80 టికెట్ల వరకే జారీ చేస్తున్నారు. కార్తీక మాసం.. శుభకార్యాలు ఎకువగా ఉండడంతో స్వామివారి కల్యాణ మొక్కుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రస్తుతం స్వామివారి నిత్య కల్యాణం కోసం భక్తులు కష్టాలు పడుతున్నారు. కౌంటర్ వద్ద చలిలో టికెట్ల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు టికెట్లు దొరకడంలేదని భక్తులు ఆలయ అధికారులుపై మండిపడుతున్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు, ఆలయంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రాజన్న దర్శణానికి వచ్చే భక్తులకు భీమేశ్వరాలయంలో మొక్కులు చెల్లించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని రాజన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
………………………………………………..
