Harish Rao Donates One Year Salary for Children's Heart Care
* హరీష్, విజయ్ దేవరకొండ ముందడుగు..
ఆకేరు న్యూస్, సిద్దిపేట: మాజీ మంత్రి, సిద్ధపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు, వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసేందుకు తన వంతుగా ఒక ఏడాది పూర్తి వేతనాన్ని విరాళంగా ప్రకటిస్తూ గొప్ప మనసు చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో నూతనంగా సేవలందిస్తున్న “శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ & రీసెర్చ్ సెంటర్” ను శనివారం నాడు ఆయన ప్రముఖ యువ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సందర్శించారు.
ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలను, చిన్నారులకు అందుతున్న ఉచిత గుండె శస్త్రచికిత్సల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను, వారి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
* తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతుంటే చూడలేం… హరీష్ రావు ఎమోషనల్
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అత్యంత భావోద్వేగానికి గురయ్యారు. “సాధారణంగా ఎవరికైనా బిడ్డ పుడితే ఆ ఇల్లంతా ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తు ఆ పుట్టిన బిడ్డ గుండెకు రంధ్రం ఉందని తెలిసినా.. ఆ బిడ్డ బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పినా.. ఆ కన్నతల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతాయి. పేదరికంలో ఉండి, అంత ఖరీదైన వైద్యం చేయించలేక నరకం చూస్తారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బిడ్డల గుండెలకు ఈ శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ, ఆ బిడ్డల ప్రాణాలతో పాటు.. ఆ తల్లిదండ్రుల గుండెలను కూడా కాపాడుతోందని కొనియాడారు. ఈ పవిత్రమైన కార్యం తనను ఎంతగానో కదిలించిందని, అందుకే ఈ ఆసుపత్రి సేవల కోసం తన ఒక సంవత్సరం ఎమ్మెల్యే వేతనాన్ని డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును కూడా ఈరోజే ఆసుపత్రి యాజమాన్యానికి అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు.
* సందడి చేసిన విజయ్ దేవరకొండ..
హరీష్ రావుతో పాటు ఆసుపత్రిని సందర్శించిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అక్కడి సేవలను చూసి అబ్బురపడ్డారు. రూపాయి ఖర్చు లేకుండా పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయడం దైవకార్యంతో సమానమని కొనియాడారు. హరీష్ రావు తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఆసుపత్రిలో చిన్నారులతో విజయ్ దేవరకొండ కాసేపు గడుపుతూ సందడి చేశారు.
సిద్దిపేట పరిసర ప్రాంతాల పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి గుండె వైద్యం ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన శ్రీ సత్య సాయి సంజీవని ట్రస్ట్‌కు ఈ సందర్భంగా హరీష్ రావు, విజయ్ దేవరకొండ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి మేనేజ్మెంట్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
