
* బీఆర్ ఎస్, బీజేపీల ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి
*తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం. కోదండరాం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 9 ని పూర్తిగా సమర్థిస్తున్నామని తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు, మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులతో రాష్ట్ర కమిటీ సబ్ కమిటీ ఏర్పాటు చేసి స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకై కార్యాచరణను రూపొందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకుని వచ్చిన జి.ఓ. 9కు పూర్తి మద్దతు తెలుపుతూ, బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్కు టి.జె.ఎస్ మద్దతు తెలపాలని నిర్ణయించారు. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును షెడ్యూల్ 9లో చేర్చాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు. బీసీల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశంలో చర్చించారు.
కోదండరాం మద్దతు కోరిన ఆర్ కృష్ణయ్య, జాజుల.
బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ మేధావి నారగోని తదితరులు నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో కోదండరామును, పార్టీ రాష్ట్ర నాయకులను కలిసి బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న జరగనున్న తెలంగాణ రాష్ట్ర బంద్ కు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆ బంద్ లో పాల్గొంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు.బీసీ సంఘాలు చేసే అన్ని పోరాటాలకు తమ పార్టీ మద్దతుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపిన పార్టీలు ద్వంద వైఖరిని అవలంబిస్తూ బీసీలను మోసం చేయడానికి కుట్ర చేస్తున్నాయని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదించిన బిల్లును షెడ్యూల్ 9లో చేర్చాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ …
సామాజిక ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తున్న కోదండరాం బీసీల ఉద్యమానికి అండగా ఉండాలని కోరారు. గల్లి నుంచి ఢిల్లీ స్థాయి వరకు జరిగే పోరాటంలో తమతో కలిసి రావాలని ఆయన కోరారు.
జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధాని రాష్ట్రపతిలను కలిసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
జన సమితి ఏర్పాటుచేసిన సబ్ కమిటీ ఇన్చార్జ్ ప్రొఫెసర్ పిఎల్ విశేషాలు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పోరాటాన్ని పటిష్టం చేయాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నరసయ్య మాట్లాడుతూ ఈనెల 15న మండల స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి బందుకు మద్దతు పలకాలని, 16వ తేదీన ఎమ్మార్వోలకు వినతి పత్రాలు, 17వ తేదీన జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈనెల 16న కోదండరామ గారి నేతృత్వంలో గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి నాయకులు గోపగాని శంకర్రావు, పల్లె వినయ్ కుమార్, రమేష్ ముదిరాజ్, ఆర్ లక్ష్మి, జస్వంత్ కుమార్, బైరి రమేష్, బాబు,సయ్యద్ ఇస్మాయిల్, దార సత్యం, రామచందర్, ఖాదర్ పాషా, హనుమంత్ గౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………