
* రాష్ట్రమంతా అన్నదాతల ఆందోళనలు
* 20 రోజులుగా దొరకడం లేదనిఆవేదన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో రైతులను యూరియా కొరత వేధిస్తోంది. తెల్లవారుజామునే పంపిణీ కేంద్రాల వద్దకు వెళ్లి రోజంతా పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదు. యూరియా (Uria) కోసం రోజుల తరబడి తిప్పలు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం రోడ్డుపైకి ధర్నాలు చేశారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ (Brs) వారికి మద్దతుగా నిలవడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. కరీంనగర్(Karimgnagar), సిద్దిపేట, మెదక్, వరంగల్, గద్వాల తదితర ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. నల్లబెల్లి మండలం మేడిపల్లి సొసైటీలో యూరియా కోసం ఉదయం 5 గంటల నుంచే రైతులు పడిగాపులు కాశారు. బస్తాల పంపిణీ సమయంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఓ రైతు స్వల్పంగా గాయపడ్డాడు. వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం బుధరావుపేట రైతు వేదిక వద్ద, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో, దంతాలపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రాస్తారోకో చేపట్టారు. గద్వాల జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఒకసారి రైతు లైన్లో నిలబడ్డారంటే ఎన్ని ఎకరాలున్నా రెండెకరాలకే ఇస్తున్నారని, దీన్ని బట్టి ఐదు ఎకరాలు ఉన్నవారు ఎన్నిసార్లు నిలబడాలని వాపోతున్నారు. కీలక దశలో పంటకు ఎరువు వేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వెంటనే యూరియా సరఫరా చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.
…………………………………..