
* భక్తుల నివేదన..వన దేవతలకు నైవేధ్యం
* నిలువెత్తు బెల్లం సమర్పించడం ఆనవాయితీ
* జాతరలో ఆరోగ్య పరిరక్షణకు దివ్యౌషధమే
ఆకేరున్యూస్, వరంగల్: వనదేవతల జాతరలో బెల్లాన్ని బంగారంగా బావిస్తారు. మేడారం జాతరలో తల్లులకు బెల్లమే నైవేద్యంగా నివేదిస్తారు. ఈ క్రమంలో మేడారంలో ఎక్కడ చూసినా బెల్లం అమ్మకాలు.. నిలువెత్తు తూకాలతో భక్తి భావపు పరిమళాలు విస్తరిస్తున్నాయి. ఈ జాతరకు బెల్లానికి ఎంతో సంబంధం ఉంది. మేడారంలో బెల్లాన్ని బంగారమని పిలుస్తారు. అమ్మవార్లకు బెల్లాన్నే నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తల్లుల గద్దెల వద్ద నుంచి చిటికెడు బెల్లం తీసుకెళ్లినా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తులు విశ్వసిస్తారు. మేడారం మహాజాతరకు దశాబ్దాల చరిత్ర ఉంది. కాకతీయులు కాలం నుంచే ఇది జరుగుతోంది. కరుడుగట్టిన నిజాం ప్రభువుల కాలంలోనూ ఈ వన వేడుక నిరంతరాయంగా జరిగేదని చెబుతుంటారు.
నాటి నుంచి బెల్లమే నైవేధ్యం..
మొదటి నుంచే గిరిజనులు, గిరిజనేతరులు ప్రతి ఒక్కరు తల్లుల సేవకు తరలి వస్తుంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బెల్లాన్నే అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఒకప్పుడు వాహనాలు లేని కాలంలో వన దేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు ఎడ్లబండ్లపై మేడారానికి వచ్చేవారు. పూర్వం సుదూరాల నుంచి మైళ్ల కొద్దీ ప్రయాణించి తల్లుల దరికి చేరుకునేవారు భక్తులు. మేడారానికి చేరుకొని దాదాపు వారం రోజుల గడిపేవారు. ఈ క్రమంలో ఆకలైనప్పుడు త్వరిత శక్తి (ఎనర్జీ)ని అందించే స్వభావం కలిగిన బెల్లం పానకంతో తయారు చేసే ఆహార పదార్థాలను తినేవారు. బెల్లం పానకంలో పల్లి గింజలు, పుట్నాలు వేసి తయారు చేసే ముద్దలను ఇష్టంగా తినేవారు. ప్రస్థుతం ఆకాశమార్గంలోనూ మహిమ గల మాతల దరికి చేరే మహాసౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
చిటికెడు బెల్లం దొరికినా మహాభాగ్యమే..
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో బెల్లానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. ‘తులాబారం’ పేరిట కిలోల కొద్ది బంగారాన్ని తల్లుల గద్దెల వద్ద సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అయితే తల్లుల గద్దెల వద్ద ఉన్న చిటికెడు బెల్లాన్నైనా ఇంటికి తీసుకెళ్తె తమ ఇంట పసిడి పంటే ఆనే విశ్వాసం భక్తుల్లో ఉంది. అందుకే మేడారం జాతరలో గద్దెల వద్ద కిలోల కొద్ది బంగారాన్ని తీసుకొచ్చి సమర్పిస్తుంటారు. తిరుగు ప్రయాణంలో మాత్రం గద్దెల వద్ద నుంచి చిటికెడు బెల్లం కావాలని పోటిపడతారు. గద్దెల వద్ద తల్లుల పాదాల చెంత పడే బెల్లానికి ఎంతో పవిత్రత ఉంటుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. బెల్లంతో పాటు గద్దెల వద్ద పసుపు, కుంకుమ , చీర, సారెలను తీసుకెళ్లేందుకు పోటీ పడుతుంటారు.
పేద భక్తుడికి బెల్లమే బంగారం..
గిరిజన, గిరిజనేతరులు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే మేడారం సమ్మక్క%-%సారలమ్మ జాతరలలో బెల్లమే బంగారంగా పేరోందింది. బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే చాలు గిరి దేవత కోరిన కోర్కెలు తీరుస్తుందనే నమ్మకం పేద భక్తుల్లో పరవశమై ఉంది. నిలువెత్తు బంగారాన్ని తల్లికి తూకం వేసి సమర్పిస్తే ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం అందుతుందని కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమని భక్తులు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు.
………………………………….