
* 14 ఏళ్ల బాలుడే నిందితుడు
*నగలు, నగదు కోసం చంపలేదు
* బ్యాట్ కోసమే హత్య చేసిన బాలుడు
* విచారణ సమయంలో పోలీసులను పక్కదారి పట్టించిన బాలుడు
* కూకట్పల్లి హత్య కేసులో విస్తుపోయే విషయాలు
* వాడు పిల్లోడు కాదు.. పెద్దోడే
* ఉరిశిక్ష వేయాలి : బాలిక తండ్రి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కూకట్పల్లిలోని బాలిక హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ కమిషనరేట్ సీపీ అవినాష్ మహంతి (Cp Avinash Mahanti) వివరాలను శనివారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలిక ఇంటికి సమీపంలో ఉన్న బాలుడే ఈ హత్య చేశాడు. ఘటన వెనుక ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నట్లు తమకు అనిపించట్లేదని పోలీసులు తెలిపారు. బాలిక చూడకుండా బ్యాట్ తీసుకెళ్లాలని బాలుడు అనుకున్నాడని, చూసే సరికి బాలికను చంపేశాడని అన్నారు. ఇంట్లో బాలికను బాలుడు కత్తితో దాడి చేసి చంపేసినట్లు తెలిపారు. బ్యాట్ (Bat) కొనలేని పేదరికంలో నిందితుడు ఆమెను హత్య చేశాడన్నారు. నిందితుడు దొంగతనానికి నెల క్రితమే ప్లాన్ చేశాడన్నారు. ఈ నెల 18న బాలిక హత్య జరిగిందని సీపీ తెలిపారు. విచారణ సమయంలో బాలుడు తప్పు దారి పట్టించాడని వెల్లడించారు. తమ స్టైల్ లో విచారిస్తే నేరం అంగీకరించినట్లు తెలిపారు. కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలుడికి బ్యాట్ నచ్చి.. క్రికెట్ బ్యాట్ కోసం ఇంటికి వెళ్లి చంపేశాడన్నారు. బ్యాట్ కోసం ఇంటికి వెళ్లిన సమయంలో బాలిక అడ్డుకుందని అన్నారు. నెట్టేయడంపై మంచంపై పడిపోయిందని, కత్తి తీసుకుని ఆమెపై దాడి చేశాడని వివరించారు. నిందితుడైన బాలుడు పాఠశాలకు సరిగా వెళ్లేవాడని కాదని అన్నారు. తన నాన్నకు జాబ్ లేదని, అమ్మ చిన్న జాబ్ చేస్తోందని, అక్కకు ఫీజు కట్టాలని బ్యాట్ కోసం వాళ్లను ఎందుకు ఇబ్బంది పెట్టాలని అడగలేదన్నారు. నిందితుడికి క్రైమ్ సిరీస్ (Crime Series)చూసే అలవాటు ఉందన్నారు. నిందితుడి తల్లిని విచారిస్తే తనకేమీ తెలియదని చెప్పిందన్నారు. బాలుడిని జువైనల్ హోం కు తరలించినట్లు వెల్లడించారు. తనిఖీల్లో నిందితుడి లేఖ, కత్తి దొరికిందని డీసీపీ సురేష్ తెలిపారు. స్పెషల్ ఫోరెన్సిక్ టీం నిందితుడిని గుర్తించిందన్నారు.
వాడికి ఉరిశిక్ష వేయాలి..
తన కూతురును పొట్టనపెట్టుకున్న వాడు పిల్లోడు కాదని, పెద్దోడే అని సహస్ర తండ్రి కృష్ణ అన్నారు. వాడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే తన కుమార్తెను చంపేశాడన్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.
…………………………………………………..